కాలుష్యముప్పు (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలుష్యముప్పు (తూర్పుగోదావరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 7 (way2newstv.com): గోదావరి నదికి సంబంధించి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించడంతో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. వాటిలో అతి పెద్దదైన తూర్పు డెల్టా కాలువ 2.64 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. దీంతో పాటు 20 లక్షల మంది తాగునీటి అవసరాలను కూడా తీరుస్తోంది. పారిశ్రామిక, అక్వా సాగు అవసరాలను తీరుస్తోంది. ఇంత ప్రాధాన్యం ఉన్న తూర్పు డెల్టా కాలువ  కాలుష్యం బారినపడుతోంది. అసలే రసాయన ఎరువులతో కలుషితమవుతున్న పంటలను ఈ కాలువల నీరు మరింత దెబ్బతీస్తోంది. ప్రజలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో నీరు పూర్తి స్థాయిలో మలినమవుతోంది. కలుషిత జలం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పరీవాహక గ్రామాల ప్రజలు అవే నీటిని నిత్యావసరాలకు వినియోగిస్తుంటారు. 


 కాలుష్యముప్పు (తూర్పుగోదావరి)

దీంతో వారు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కాలువలో చెత్త, వ్యర్థాలను వేయడంపై పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు మినహా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
మురుగునీటిని ప్రధాన నదుల్లోకి వదలకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ కలపాల్సి వస్తే శుద్ధి చేసిన నీటిని నది మధ్యలో మాత్రమే వదలాలి. నదికి అనుసంధానంగా ప్రవహించే పంట కాలువల్లోకి మురుగు నీటిని నేరుగా, శుద్ధి చేసి ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదు. కాలువ పరీవాహక ప్రాంతాల్లో సైతం చెత్త వేయకూడదు. పలు చోట్ల గ్రామ పంచాయతీలు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు.
జిల్లాలోని తూర్పు డెల్టా కాలువపై సామర్లకోట, అరట్లకోట, బొబ్బర్లంక వద్ద మూడు తాగునీటి జలాశయాలు ఉన్నాయి. వీటి నుంచి కాకినాడ, పెద్దాపురం, సామర్లకోటతో పాటు మరో 23 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. సుమారు 20 లక్షల మంది గోదావరి నీటినే తాగుతున్నారు. వీటితో పాటు జిల్లాలోని తాగునీటి అవసరాల కోసం 65 చెరువులకు ఏటా మూడు టీఎంసీల నీటిని అందిస్తున్నారు. తాజాగా రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని 17 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.50 కోట్లతో ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీని ద్వారా మరో 10 లక్షల మందికి నీటిని పంపిణీ చేయనున్నారు