పనులు, నిధులు వృథా (మెదక్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పనులు, నిధులు వృథా (మెదక్)

మెదక్, ఫిబ్రవరి 7  (way2newstv.com): పేద రైతుల అభివృద్ధికి అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోక పోవడంతో నిధులు, పనులు వృథా అయ్యాయి. 181 ఎకరాల సీలింగ్‌ భూమి నిరుపయోగంగా మారింది. 181 మంది లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోయింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం, లబ్ధిదారులైన రైతులకు సరైన సలహాలు, సూచనలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రయత్నం నిష్పలం అయింది. వెల్దుర్తి మండలం కుకునూర్‌ గ్రామ పంచాయతీ పరిధి హల్దీవాగు ఒడ్డున 181 ఎకరాల సీలింగ్‌ భూమి ఉంది. 


 పనులు, నిధులు వృథా (మెదక్)

ఆ భూమిని సస్యశ్యామలం చేసేందుకు 27 ఏళ్ల క్రితం అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కుకునూర్‌ పంచాయతీలోని పేద రైతులను గుర్తించి పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆ భూమిని సర్వే చేసి కుకునూర్‌, బస్వాపూర్‌, పంతులుపల్లి, దామరంచ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేశారు. అవన్నీ హల్దీవాగు ఒడ్డున ఉండటం, సారవంతమైనవి కావడంతో 1992లో పండ్ల తోటలు సాగు చేస్తే బాగుంటుందని భావించి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 50 శాతం రాయితీతో నిధులు మంజూరు చేయించి 116 ఎకరాల భూమిని చదును చేయించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 100 కేవీ విద్యుత్తు నియంత్రిక ఏర్పాటు, ఏపీఎస్‌ఐడీసీ సహకారంతో హల్దీవాగులో రెండు ఎత్తిపోతల బావులు తవ్వించారు. మొత్తాం భూమికి నీరందించేందుకు ఇనుప, పీవీసీ పైపులు ఏర్పాటు చేయించారు. వాగులోని ఎత్తిపోతల బావుల్లో 7.5 హెచ్‌పీ సామర్థ్యం గల విద్యుత్తు మోటార్లు బిగింప చేశారు. అంతవరకు బాగానే ఉన్నా అనంతరం సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఎత్తిపోతల పథకం వట్టిపోయింది.
181 మంది రైతుల్లో సమన్వయం లేకపోవడం, ఇచ్చిన భూమికి హద్దులు చూపకపోవడంతో ఇబ్బందిగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. భూములకు హద్దులు చూపి ఐదు ఎకరాలకు ఒక బోరు వేయిస్తే సాగు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి వచ్చి భూములను పరిశీలించి, వాటికి హద్దులు చూపడానికి, అభివృద్ధి చేయడానికి రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయ అధికారులతో చర్చలు జరిపి మళ్లీ ఇటువైపు రాలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.