సామాజిక కోణంలోనే విస్తరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సామాజిక కోణంలోనే విస్తరణ

హైద్రాబాద్, ఫిబ్రవరి 16, (way2newstv.com)
ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ ముహుర్తం ఖరారు చేశారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినప్పటికీ మంత్రివర్గ విస్తరణ మరో మూడు రోజుల్లో జరగనున్నదని కథనాలు రావడంతో ఎంతమందితో మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నారు అనే అంశాలపై కూడా చర్చించుకుంటున్నారు.అయా సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గంలో చోటు ఎవరికీ దక్కుతుందో అనే ఊహగానాలు మొదలైనాయి.  మరోవైపు కేబినెట్ కూర్పుపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం కూడా ఒకపక్కా జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. 


సామాజిక కోణంలోనే విస్తరణ

అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 16 మందిని తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 8 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా వారికి లోకసభ ఎన్నికల తర్వాత చోటు కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి దఫాలో సీనియర్లకు అవకాశమివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది.మంత్రివర్గంలో చోటు దక్కించునే విషయంలో కొందరు నేతల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, హరీష్‌రావు, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,  రైతు సమన్వయ సమితి రాష్ట్ర ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డ్డి లేదా జగదీష్‌రెడ్డ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, కొప్పుల ఈశ్వర్, పద్మాదేవేందర్‌రెడ్డ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్,  ఈటల రాజేందర్, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే వీరిలో సామాజిక సమీకరణలను కూడా చూస్తున్నట్లు తెలిసింది. దాంతోపాటు పాత జిల్లాల ప్రకారం జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటే వెలమ, రెడ్డిలు, కమ్మ, బీసీ, మున్నూరు కాపు, గౌడ్, యాదవ్‌లు, మహిళ, ఎస్సీ, ఎస్టీలను కవర్ చేసే విధంగా మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో ముగ్గురు ఓటమి పాలయ్యారు. వారిలో రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు ఓడిపోయారు. అయా స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు కేటీఆర్, హరీష్‌రావు బెర్త్ ఖాయమని తెలుస్తుంది. తొలిదశలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.ఒకవేళ ఎర్రబెల్లి ఇస్తే వెలమ సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు దక్కనున్నాయి. జిల్లాల వారిగా చూసినప్పటికీ పాత వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరికి అవకాశం ఇస్తే ఎర్రబెల్లికి అనుమానమే. మహబూబ్‌నగర్ జిల్లాల్లో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి అనుమానమే. ఈ జిల్లాల్లో బీసీ వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.బీసీల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ పేరును పరిశీలించే అవకాశముంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగ సంఘాల నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వంలోనే ఆయనకు మంత్రిపదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ సారి తప్పకుండా బీసీ కోటాలో రావచ్చునని భావిస్తున్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఓడిపోవడంతో ఆయన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి పేరు పరిశీలించనున్నట్లు తెలిసింది.పైగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డిని ఓడించడం ఆయనకు కలిసొచ్చే అవకాశం. నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును పరిశీలించే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారముండేది. కానీ రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌కే పరిమితం కావడంతో ఈసారి ఆయనకు మంత్రిపదవి వరించనున్నట్లు తెలుస్తుంది.ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడంతో కేటీఆర్‌కు సన్నిహితుడుగా ఉన్నపువ్వాడ అజయ్‌కుమార్‌ను పరిగణలోకి తీసుకోనున్నారు. సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లోకి వస్తే ఆయనకు అవకాశమివ్వనున్న ట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇప్పటి వరకూ రాకపోవడంతో అజయ్‌కుమార్‌కే అవకాశాలు మెగ్గుగా ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో  కేటీఆర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు దాదాపు బెర్త్ ఖాయమని తెలుస్తుంది. ఇదే జిల్లాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ గత ప్రభుత్వం నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కొప్పులకు ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజామా బాద్ జిల్లాలో వేముల ప్రశాంత్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది.ఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన ప్రశాంత్‌రెడ్డి తప్పకుండా వరిస్తుందని తెలుస్తుంది. ఇదే జిల్లాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజీరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి జోగు రామన్న కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిసింది.మెదక్ జిల్లా నుంచి హరీష్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డిలకు బెర్త్ ఖాయమని సమాచారం. ఇదే జిల్లా నుంచి సీఎం కేసీఆర్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ పద్మాదేవేందర్‌రెడ్డి మంత్రిపదవి ఇస్తే మహిళా కోటా పూర్తయినట్లు భావిస్తున్నారుఅప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా రేఖానాయక్ పేరును పరిశీలించవచ్చునని సమాచారం. దీంతో మంత్రివర్గ కూర్పుపై అయా సామాజిక సమీకరణాలు, జిల్లాల భాగస్వామ్యం తదితర అంశాలను సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది.