కాలుష్య కోరల్లో హైద్రాబాద్

హైద్రాబాద్, ఫిబ్రవరి 8, (way2newstv.com)
అధ్వాన రోడ్లు బాగుపడితే మనం పీల్చే గాలి ‘స్వచ్ఛం’గా మారుతుంది.  రహదారులకు.. పీల్చే గాలికి సంబంధమేంటని సందేహంగా ఉందా.. కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలోనూ.. సూక్ష్మ ధూళి కణాలు 33 శాతం.. అతి సూక్ష్మ ధూళి కణాలు 11 శాతం రోడ్ల నుంచే వెలువడుతున్నట్లుగా తేలిందని పర్యావరణ నిపుణులు వివరిస్తున్నారు.వాయు కాలుష్యం కోరలు చాస్తోన్న మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాహనాలు, రోడ్లు, చెత్తను కాల్చడం, నిర్మాణ పనులు తదితర కార్యకలాపాల వల్ల గాల్లోకి నిత్యం పీఎం 10, పీఎం 2.5, నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్మోనాక్సైడ్ తదితర 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి.


కాలుష్య కోరల్లో హైద్రాబాద్

స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే పీఎం 10, కంటికి కనిపించకుండా నేరుగా ఊపిరితిత్తులోకి చేరి అక్కడే స్థిరపడి లేనిపోని అనారోగ్య సమస్యలకు కారణమయ్యే పీఎం 2.5 తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గతేడాది 20 ప్రాంతాల్లో ఎలా ఉందని లెక్కలు తీస్తే అన్ని చోట్ల పీఎం 10 కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల్ని దాటింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 చోట్ల 100 మార్కును దాటిందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల వ్యవధిలోనే 11 మైక్రోగ్రాములు పెరిగింది. 2016తో పోలిస్తే 2017లో పీఎం 2.5 తీవ్రత భారీగా పెరిగినట్లుగా పీసీబీ లెక్క తేల్చింది. ఒక్క చోట మాత్రమే సీపీసీబీ నిర్దేశిత పరిమితుల్ని దాచలేదు. మిగిలిన చోట్ల దుమ్ము దులిపింది.పీఎం 10, పీఎం 2.5 తీవ్రత 2020 నాటికి ఎలా ఉండే అవకాశముందో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్‌ఐ) ఓ అధ్యయనం చేసింది. ఆ గణాంకాలను పరిశీలిస్తే గుండె గుభేల్మనడం ఖాయం. 2006లో పీఎం 10... 29,599 టన్నులు వెలువడగా.. 2020 నాటికి అది 43,550 టన్నులకు చేరుకోనుంది. ఇక పీఎం 2.5 విషయానికొస్తే 2006లో 11,380 టన్నులు వెలువడగా..2020 నాటికి 18,412 టన్నులకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) అధ్యయనంలో దక్షిణ భారతదేశంలో అత్యధికంగా పీఎం 2.5 నమోదవుతున్న నగరాల్లో బెంగళూరు(61 మైక్రోగ్రాములు) తర్వాత హైదరాబాదే(59 మైక్రోగ్రాములు) ఉంది.కాలుష్య ఉద్గారాల్లో అధిక వాటా వాహనాలది.. ఆ తర్వాతి స్థానం రోడ్లదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షల మార్కును దాటేసింది. అయిదారేళ్ల వ్యవధిలో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. మెట్రో నగరాల్లో 100కు 60 మంది ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని.. మన దగ్గర మాత్రం ఆ సంఖ్య 40 మాత్రమే ఉందంటూ నిపుణులు వివరిస్తున్నారు. అలా అని వాహనాలు రోడ్డెక్కకుండా ఆపేస్తే అభివృద్ధి ఆగిపోతుందని స్పష్టం చేస్తున్నారు.కాలుష్యం తగ్గేందుకు ప్రత్యామ్నాయ చర్యలను అన్వేషించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే అధ్వాన రోడ్లపై నజర్ పెట్టాలని సూచిస్తున్నారు. రోడ్లు బాగుపడితే ‘దుమ్ము’ లేవదు. పైగా.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. వేగం పెరుగుతుంది. ఫలితంగా గాల్లోకి వెలువడే పీఎం 10, పీఎం 2.5 తీవ్రత కొంత వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
Previous Post Next Post