ఫించన్ దారులకు నిరాశే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫించన్ దారులకు నిరాశే

కాకినాడ, ఫిబ్రవరి 16, (way2newstv.com)

దివ్యాంగుల అంగవైకల్యాన్ని నిర్ధారించేందుకు జారీ చేసే ‘సదరన్‌ సర్టిఫికెట్‌’ మంజూరుకు ఆన్‌లైన్‌ సహకరించడం లేదు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్నా, సంబంధిత సైట్‌ తెరచుకోకపోవడంతో పింఛన్‌దారులకు నిరాశ ఎదురవుతోంది. ఈ విషయం తెలియని అనేక మంది దివ్యాంగులు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.జిల్లాలో సదరన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 


 ఫించన్ దారులకు నిరాశే

అయితే కాలక్రమేణ ఆ జాబితా నుంచి తునిని తొలగించి మిగతా మూడు కేంద్రాలను యథావిధిగా కొనసాగిస్తోంది.రెండు నెలల నుంచి సదరన్‌ సర్టిఫికెట్‌ జారీకి దరఖాస్తు చేసుకునే సైట్‌ పనిచేయడం లేదు. అనేకమంది దివ్యాంగులు తమ అంగవైకల్య శాతాన్ని నిర్ధారించుకునేందుకు సమీప మీ సేవ కేంద్రాలకు వెళుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో దివ్యాంగుడి వివరాలను అన్ని పొందుపరచి ఓకే చెప్పిన తరువాత మళ్లీ రీ ఎంట్రీ  చేయాలని చూపుతోంది. మీ సేవ నిర్వాహకుడు ఎన్నిసార్లు వివరాలు పొందుపరచినా మళ్లీ మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోంది. దీనిపై ఏపీ ఆన్‌లైన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోందని ‘మీ సేవ’ నిర్వాహకులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సదరన్‌ సర్టిఫికెట్స్‌ జారీ చేయడంతో ఇంత ఉదాసీనతగా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో మండల ప్రజా పరిషత్, వెలుగు కార్యాలయాల ద్వారా దివ్యాంగుల వివరాలను సేకరించగా ప్రస్తుతం మళ్లీ ఆ పద్ధతిని మార్చి మీ సేవ కేంద్రాలకు అప్పగించడం వల్ల దివ్యాంగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారని ప్రజలు హెచ్చరిస్తున్నారు.