నల్లగొండ జిల్లాల్లోనే 629 కోట్ల విద్యుత్ బకాయిలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నల్లగొండ జిల్లాల్లోనే 629 కోట్ల విద్యుత్ బకాయిలు

నల్లగొండ, ఫిబ్రవరి 16, (way2newstv.com)
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి విద్యుత్ శాఖకు వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడం విద్యుత్ సంస్థ నిర్వాహణ మనుగడకు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుకు సవాల్‌గా మారుతుంది. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాతో విద్యుత్ సంస్థలు ఆర్ధిక భారాన్ని ఎదుర్కోంటుండగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి, ప్రజల నుండి రావాల్సిన బిల్లుల బకాయిలు వందల కోట్లలో పేరుకుపోవడం సంస్థ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి 620కోట్ల 57లక్షల బకాయిలు సంస్థ మనుగడకు గుదిబండగా మారాయి. 


నల్లగొండ జిల్లాల్లోనే 629 కోట్ల విద్యుత్ బకాయిలు

ఇందులో గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల బకాయిలే 525.69కోట్లు పేరుకుపోవడం సమస్యగా తయారైంది. బిల్లుల వసూళ్ల కోసం విద్యుత్ అధికారులు నోటీస్‌లు జారీ చేసినా పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయల నుండి పెద్దగా స్పందన లేకపోవడంతో బకాయిల వసూళ్లకు విద్యుత్ శాఖ ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సంఘం నిధులు, ఇతర గ్రాంట్‌లు పంచాయతీలకు అందినప్పుడు బిల్లుల సర్ధుబాటుకు అవకాశమున్నా బిల్లుల చెల్లింపులకు మాత్రం స్థానిక సంస్థల పాలకవర్గాలు ఆసక్తి చూపకపోవడం విద్యుత్ శాఖకు షాక్‌నిస్తుంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 14లక్షల 35,863ఉండగా వీటీలో వ్యవసాయ కనెక్షన్లు 4,05,975 ఉండగా బిల్లుల బకాయిలు 46కోట్ల 32లక్షలు, గృహ విద్యుత్ కనెక్షన్లు 90,1964ఉండగా బిల్లుల బకాయిలు 32.53కోట్లు ఉన్నాయి. కమర్షియల్ 97,447కనెక్షన్స్ ఉండగా బిల్లుల బకాయిలు 8.92కోట్లు ఉన్నాయి. ఐటీ, పరిశ్రమలు 9,207కనెక్షన్స్ ఉండగా 3.42కోట్ల బకాయిలు, కుటీర, చిన్నతరహా పరిశ్రమల కనెక్షన్లు 3,651ఉండగా బిల్లుల బకాయిలు 21వేలు, హాస్టల్స్, దేవాలయాలు, మసీద్‌లు 5,213కనెక్షన్లుండగా బిల్లుల బకాయిలు 4.39కోట్లు, గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల్లోని వీధి దీపాలు, మంచినీటీ స్కీమ్‌ల కనెక్షన్లు 12,107 ఉండగా బిల్లుల బకాయిలు 525.69కోట్లు ఉన్నాయి. ఇందులో పంచాయతీల పరిధిలోని బకాయిలు 484.20కోట్లు, మున్సిపాల్టీల బకాయిలు 41.48కోట్లు ఉన్నాయి. ఈ విభాగంలో ప్రస్తుత నల్లగొండ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల నుండే 222.85కోట్లు వసూలు కావాల్సివుంది. ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్‌లు, వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల విద్యుత్ బిల్లులు 7.26కోట్లు ఉన్నాయి. విద్యుత్ సంస్థ మనుగడకు సవాల్‌గా మారిన విద్యుత్ బకాయిల చెల్లింపులపై నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల పాలక వర్గాలు దృష్టి పెట్టినట్లయితే విద్యుత్ శాఖను కొంత మేరకు బలోపేతం చేసినట్లవుతుందని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.