సూపర్‌ స్పెషాలిటీకి ఎదురుచూపులే! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సూపర్‌ స్పెషాలిటీకి ఎదురుచూపులే!

ఆదిలాబాద్, ఫిబ్రవరి 01, 2019 (way2newstv.com)
ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. సర్కారీ దవాఖానాలను పటిష్టం చేస్తూ ప్రజలకు సమర్ధవంతమైన వైద్యసేవలు లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించడమే కాకుండా అత్యాధునిక పరికరాలు సమకూర్చుతోంది. అంతేకాక పలు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి స్వస్థ్‌ సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై)-3ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలను కేంద్రం సెలక్ట్ చేసింది. ఇలా ఎంపికైన జిల్లాలో ఆదిలాబాద్ కూడా ఉంది. 2015లోనే కేంద్రప్రభుత్వం రూ.150 కోట్లతో ఆసుపత్రిని మంజూరు చేసింది. 


 సూపర్‌ స్పెషాలిటీకి ఎదురుచూపులే!

దీనిలో కేంద్రం వాటా రూ.120 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు. ఆసుపత్రిని రూ.77.57 కోట్లతో నిర్మించడానికి కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. భవన నిర్మాణ వ్యయం పోను రూ.70 కోట్లతో ఆసుపత్రిలో అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, తదితరాలను సమకూర్చాలని నిర్ణయించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలన్నది నిబంధన. పనులు ప్రారంభించి రెండున్నరేళ్లు దాటినా 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సిన భవనం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మరింతకాలం ఎదురుచూపులు తప్పేలా లేవని వాపోతున్నారు.
రెండున్నరేళ్లుగా హాస్పిటల్ భవనం నిర్మాణ దశలోనే ఉండడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడిజిల్లావాసులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని, బడుగులకు సమర్ధవంతమైన వైద్యం లభిస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ ఆసుపత్రి భవన నిర్మాణం ఆలస్యమవడానికి పలు కారణాలున్నాయి. ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న స్థలం వద్దే పురపాలక భూగర్భ పైప్‌లైన్‌ ఉంది. ఈ పైప్ వల్లే పనులు జాప్యమవుతున్నాయని కాంట్రాక్టర్ అంటున్నారు. ఇక్కడి పైప్‌లైన్‌ను తొలగించి ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగానికి సూచించారు. అయితే పురపాలక సంఘం వారు సకాలంలో స్పందించలేదని చెప్తున్నారు. మొత్తంగా పైప్‌లైన్‌ వల్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని చెప్తూ కాంట్రాక్టర భవన నిర్మాణ ఒప్పందాన్ని మరో ఆరు నెలలు పొడిగించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఏడాదిన్నర వ్యవధిలోనే అందుబాటులోకి వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంట్రాక్టర్ కోరుతున్నట్లు గడువు పెంచితే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు మరో సంవత్సరం పాటూ వేచి చూడాల్సి ఉంటుంది. భవనంలో అత్యాధునిక పరికరాల ఏర్పాటుకు కొంత టైమ్ పడుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని  కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ఆసుపత్రి పనులు త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. గడువు మరింతగా పొడిగించకుండా హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.