‘ఈ-పోస్‌’తో అంగన్‌వాడీలకు సరకుల పంపిణీ

 ‘ఈ-పోస్‌’తో అంగన్‌వాడీలకు సరకుల పంపిణీ
కుమురం భీమ్, ఫిబ్రవరి 01, 2019 (way2newstv.com)
రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు సర్కార్ ఈ-పోస్ విధానం అమలుచేస్తోంది. రేషన్ సరకులు పక్కదోవ పట్టకుండా లబ్ధిదారులకే చేరేలా చర్యలు తీసుకుంటోంది. ఈ-పోస్ వల్ల అక్రమాలకు గణనీయంగా అడ్డుకట్టపడింది. అర్హులకు సక్రమంగా రేషన్ అందుతోంది. మొత్తంగా ఈ-పోస్ సత్పలితాలు ఇచ్చింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ విధానం ద్వారా బియ్యం సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు కూడా ప్రారంభించారు. వాస్తవానికి అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ ద్వారా బియ్యం అందేది. ఈతరహా పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. 


 ‘ఈ-పోస్‌’తో అంగన్‌వాడీలకు సరకుల పంపిణీ

ఈ-పోస్ విధానం ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1తేదీ నుంచే ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఇకనుంచి అంగన్‌వాడీ కార్యకర్తలే వారికి నిర్దేశించిన రేషన్ దుకాణాలకు వెళ్తారు. కేంద్రానికి కేటాయించిన మేర బియ్యం తీసుకుంటారు. ఈ-పోస్‌ విధానం వల్ల రేషన్ పంపిణీలో అక్రమాలకు తెరపడింది. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ విధానం వల్ల బియ్యం సరఫరా చేస్తుండడంపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బియ్యంలో ఇకమీదట అక్రమాలకు తావు ఉండదని అంటున్నారు. 
ఈ-పోస్ విధానం వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయించిన మేరకు బియ్యం సరఫరా అవుతాయి. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అంది ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. ఉమ్మడి జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇందులో 4,023 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 3,257 కార్యకర్తలు పనిచేస్తున్నారు. కేంద్రాల్లో 3,591 మంది సహాయకులు ఉన్నారు. నాలుగు జిల్లాల్లో నమోదైన చిన్నారుల సంఖ్య 2,80,427. ఇక 23,152మంది గర్భిణుల కాగా, బాలింతలు 2,511 మంది ఉన్నారు. ఐసీడీఎస్‌ అధికారులు పంపిణీ ఇండెంట్‌ ప్రకారం ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన వివరాలను పౌరసరఫరాల శాఖ వారు ఇది వరకే పంపించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు వారికి కేటాయించిన చౌకధరల దుకాణాల నుంచి వారే వేలి ముద్రలు వేసి బియ్యం తీసుకుంటారు. దీంతో అక్రమాలకు తావు ఉండదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను బోధిస్తూ, ఒక పూట పౌష్టికాహరం అందిస్తారు. బాలింతలు, గర్భిణులకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తారు. దీనికి అవసరమైన బియ్యం, పప్పులు పౌరసరఫరాల శాఖ నుంచి సరఫరా చేసేది. అయితే ఈ సరకులను కాంట్రాక్టర్ ద్వారా పంపిణీ చేసేవారు. కాంట్రాక్టర్లు పౌరసరఫరా శాఖ గోడౌన్ల నుంచి సరకులు సరఫరా చేసేవారు. కొన్నిసందర్భాల్లో అంగన్‌వాడీలకు సక్రమంగా సరకులు సరఫరా చేయకపోవటం, లేదా తక్కువగా సరకులు అందుతుండేవి. దీంతో కేంద్రాల సిబ్బంది, లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ-పోస్ విధానం ద్వారా సమర్ధవంతంగా సరకులు అందేలా చర్యలు తీసుకుంటోంది సర్కార్.
Previous Post Next Post