హరీష్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరీష్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా...

హైద్రాబాద్, ఫిబ్రవరి 15, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఎంత కీలకమో అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుముకగా ఉంటూ టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక కీలకమైన నీటిపారుదల శాఖకు మంత్రిగా వ్యవహరించి.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు హరీష్ రావు. అయితే రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాత్రం హరీష్ రావును పార్టీ కాస్త పక్కన పెడుతుండటం.. ఆ పార్టీ నేతలను ఆందోళనలో పడేస్తోందట. తెలంగాణలో 2014లో కేసీఆర్ అధికారం చేపట్టినప్పుడు.. కోటి ఎకరాలకు సాగునీరవ్వాలనే యజ్ఞాన్ని పెట్టుకుంది టీఆర్ఎస్. ఈ యజ్ఞంలో భాగంగా  ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. పార్టీలో అత్యంత సమర్థుడిగా పేరున్న హరీష్ రావు వాటిని అమలు చేసే బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు.


 హరీష్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా...

 తనపై కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా ఊహించనంత వేగంగా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు హరీష్. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ కృషి ఏ నాటికీ మరవలేనిది. ఈ ప్రాజెక్టు విషయమై కేసీఆర్ ఎప్పటికప్పుడు హరీష్ ని పొగుడుతూనే వస్తున్నారు. హరీష్ రావు పట్టుదల వల్లే ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యాయని కితాబిచ్చారు కూడా. రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై.. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులకు, హరీష్‌కు సంబంధం లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారశైలి మారిపోవటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు హరీష్‌రావుకు మళ్లీ సాగునీటి ప్రాజెక్టుల శాఖ కేటాయించడం లేదని, అందుకే ఆయనకు ప్రాజెక్టుల అంశంలో ప్రాధాన్యం దక్కడం లేదని, పర్యటనలకు పిలుపు రావడం లేదని వస్తున్న వార్తలు పార్టీ లోని కొందరు నేతలను కలవరపెడుతున్నాయట. పార్టీకి ప్రాణం పోసిన హరీష్ రావు విషయంలో కేసీఆర్ తీరు జనాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే హరీష్‌రావును దూరం పెడుతున్నారా? లేక దీని వెనుక తెలియని కారణాలేమైనా ఉన్నాయా? అనేది మాత్రం టీఆర్ఎస్ నేతలకే అంతు చిక్కడం లేదు. మొత్తానికి లోలోపల ఏదో జరుగుతోందనే ఆందోళన మాత్రం ప్రారంభమయింది. హరీష్ ను ఇంత గా అవమానిస్తూంటే.. ఆయన ఎందుకు సైలెంట్‌గా ఉంటారనే చర్చ కూడా నడుస్తోంది. దీంతో చివరకు హరీష్ విషయంలో కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయం ఏమిటనేది ఆసక్తికర అంశంగా మారింది.