తెలంగాణ భవన్ కు దూరంగా నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ భవన్ కు దూరంగా నేతలు

ఆశావాహుల ఒత్తడితో కేటీఆర్
హైద్రాబాద్, ఫిబ్రవరి 15, (way2newstv.com)
ఎవ్వరు ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు తెరలేపి సంచలనం సృష్టించారు కేసీఆర్. మరో ఆరునెలల సమయం ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయ ఢంకా మోగించారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్.. ఎవ్వరికీ అంతుచిక్కకుండా వెరైటీగా ముందుకు సాగుతున్నారు. తాను, మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి.. మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఎందుకింత ఆలస్యం చేస్తున్నారనేది అర్థం కావటం లేదు రాజకీయ వర్గాలకు. ఇదిలా ఉంటే మరోవైపు తన కొడుకు కేటీఆర్ ని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడమే గాక మరిన్ని కీలక బాధ్యతలు కేటీఆర్ చేతిలో పెట్టి తాను దేశ రాజకీయాల దిశగా అడుగులు వేస్తుండటం గమనించవచ్చు. 

 
తెలంగాణ భవన్ కు దూరంగా నేతలు

ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న ఆశావహులు అయోమయానికి గురవవుతున్నారట. తండ్రీ కొడుకులిద్దరిలో ఎవరిని కాకా పట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. అయితే తండ్రిని ఏ మాత్రం తీసిపోని విధంగా కేటీఆర్ కూడా వ్యూహాలు రచిస్తూ ఎవ్వరినీ మెసలనీయకుండా ఉంచటం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీలోని చిన్నా, పెద్దా అందరి అభిమానం చూరగొంటూనే కేటీఆర్ ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందట ఆ పార్టీ నేతలను. మంత్రి పదవులు మొదలుకొని ఇతర పదవులు, త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో పలువురు ఆశావాహులు తెలంగాణ భవన్ చుట్టూ తెగ తిరుగుతున్నారు. కేసీఆర్ కలవకున్నా కనీసం కేటీఆర్ దృష్టిలో నైనా పడాలని తెలంగాణ భవన్ బాట పట్టారట నేతలంతా.తమను కలవని కేసీఆర్ స్థానే.. కేటీఆర్ ను కలిసి తమ తమ ఆసక్తులను  తెలిపే ప్రయత్నం చేస్తున్నారట. మంత్రివర్గ విస్తరణలో జాప్యం పెరుగుతుండటంతో ఇలా వచ్చే గులాబీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోందట. దీంతో అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం సాధ్యం కాదని భావించిన కేటీఆర్ టీఆర్ఎస్ భవన్ వెళ్ళటమే మానేశారని సమాచారం. తనకు సైతం చెప్పకుండా నిర్ణయాలు తీసుకునే తన తండ్రి వైఖరి తెలిసిన కేటీఆర్.. గులాబీ నేతలకు ఏమి చెప్పాలో పాలుపోక చివరకు టీఆర్ఎస్ భవన్ వెళ్లకపోవటమే సరైందని భావించారేమో! అందుకే ఈ నిర్ణయానికి వచ్చారంటూ చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎలాగైతేనేం నేతలకు చెక్ పెట్టడంలో కొడుకు తండ్రిని మించిపోయారని అంటున్నారు ఈ పరిణామాలు చూసిన రాజకీయ విశ్లేషకులు.