మళ్లీ ఎన్నికల బరిలో శరద్‌ పవార్‌!

ముంబయి ఫిబ్రవరి 14 (way2newstv.com)
మళ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌. తాను ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని 2012లో శరద్‌ పవార్‌..  ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక లేదని, కానీ తమ పార్టీ నేతలు తనను పోటీ చేయాలని కోరుతున్నారని ఆయన ఇటీవల‌ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు నిర్వహించిన ఓ సమావేశంలో.. ఆయనను మళ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించారు. 


మళ్లీ ఎన్నికల బరిలో శరద్‌ పవార్‌!

ఆయన మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి మళ్లీ పోటీకి దిగనున్నట్లు స్పష్టత వచ్చింది. 2009లో ఆయన ఈ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. అయితే, తాను ఇక ఎన్నికల బరిలోకి దిగనని అప్పట్లో ఆయన ప్రకటించడంతో 2014లో ఆ స్థానం నుంచి ఎన్సీపీ.. తమ నేత విజయసింహా మోహిత్‌ పాటిల్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన కూడా ఆ స్థానంలో గెలుపొందారు.తాజాగా, ఎస్సీపీ నేతలు రామ్‌రాజే నింబల్కర్‌, ఎంపీ మోహిత్‌ పాటిల్‌తో పాటు పలువురు నేతలు సమావేశం నిర్వహించారు. మాధా నియోజక వర్గం నుంచి ఈ సారి పోటీకి దిగొద్దని, అక్కడి నుంచి శరద్‌ పవార్‌ పోటీ చేస్తారని మోహిత్‌ పాటిల్‌కు తోటి నేతలు సూచించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. చివరకు ఆయనకు నేతలు నచ్చచెప్పారు. మాధా నుంచి పవార్‌ను పోటీకి దింపే విషయంలో తాము ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఉన్న చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించడానికే తాము సమావేశమయ్యామని ఎన్సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఆయన మాధా ఎంపీగా ఉన్నారు. ఎన్సీపీ ఈ సారి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఆయన పోటీకి దిగుతారా? లేదా? అన్న విషయంపై నెలకొన్న సందిగ్ధత తొలగింది. 
Previous Post Next Post