రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

తిరుమల, ఫిబ్రవరి 06: (way2newstv.com)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీన జరుగనున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధుల్లో చేపడుతున్న ఏర్పాట్లను టిటిడి తిరుమల జెఈవో  కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం పరిశీలించారు. 
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 9.00 గంటల వరకు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలు, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 


రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు టి, కాఫి, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. మాడ వీధుల్లో ఉన్న దాదాపు 170 గ్యాలరీల్లో అన్నప్రసాద వితరణకు 55 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 300 మంది సిబ్బందికి డెప్యుటేషన్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, ఆరోగ్య సిబ్బంది ఉంటారని, సీనియర్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. భక్తులు సంయమనంతో వ్యవహరించి గ్యాలరీల్లో వేచి ఉండి వాహనసేవలను తిలకించాలని కోరారు. భక్తులు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా 20 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడంతోపాటు విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశామని తెలిపారు. దివ్యదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయన్నారు. 
 ముందుగా గ్యాలరీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగవల్లులను పరిశీలించారు.