రోజుకు వంద మంది కొత్త సర్పంచ్ లకు ట్రైనింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోజుకు వంద మంది కొత్త సర్పంచ్ లకు ట్రైనింగ్

35 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్లాన్
హైద్రాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
 రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లకు ఈ నెల 16వ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ రిసోర్సు పర్సన్ ఐదుగురికి చొప్పున సర్పంచ్‌లకు ఒక్కో బ్యాచ్‌కు యాభై మంది చొప్పున రోజుకు రెండు బ్యాచ్‌ల్లో వందమందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని పన్నెండు వేల మందికిపైగా సర్పంచ్‌లు ఉన్నారు.ఐదు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సర్పంచ్‌లకు శిక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 340 మంది రిసోర్స్ పర్సన్లకు హైదరాబాద్ నగరంలోని టిఎస్‌ఐపార్డ్ లో శిక్షణ పూర్తయింది. 


రోజుకు వంద మంది కొత్త సర్పంచ్ లకు ట్రైనింగ్

ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లంతా జిల్లాలవారీగా షెడ్యూలు ప్రకారం కొత్త సర్పంచ్‌లకు ఆయా జిల్లాల్లోనే శిక్షణ ఇస్తారు. ప్రతీ జిల్లాకు పది మంది చొప్పున రిసోర్స్ పర్సన్లను గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. రిసోర్సు పర్సన్లు వారికి కేటాయించిన జిల్లాలకు ఈ నెల 15వ తేదీలోగా చేరుకుని ఈ నెల 16 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సర్పంచ్‌లకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. సర్పంచ్‌ల విధులు, బాధ్యతల నిర్వహణతో పాటు గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయ విధానం, పారిశుద్ధ కార్యక్రమాలు, పచ్చదనం పెంపు, పంచాయతీల విధి, విధానాలు, పంచాయతీలకు వచ్చే కేంద్ర, రాష్ట్ర నిధులు, సోషల్ ఆడిట్ తదితర అంశాలపై కూలంకషంగా శిక్షణ ఇస్తారు. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లో సర్పంచ్‌ల సంఖ్య 500 మొదలు 800కు పైగా ఉన్నారు. మేడ్చల్‌లో 61 మంది, సిరిసిల్ల, జోగులాంబ జిల్లాలో 255 వరకు సర్పంచ్‌లున్నారు. కొన్ని జిల్లాల్లో సర్పంచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండగా, మరికొన్ని జిల్లాలో వారి కాస్త తక్కువగా ఉంది. అయితే ఎక్కువమంది సర్పంచ్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లో రిసోర్స్ పర్సన్లను కూడా ఎక్కువ సంఖ్యలోనే కేటాయించింది. రాష్ట్రంలో సగటున జిల్లాలో 400 మంది చొప్పున సర్పంచ్‌లు ఉన్న కారణంగా జిల్లాకు పది మంది చొప్పున రిసోర్స్ పర్సన్లు ఉండేలా గ్రామీణాభివృద్ధి శాఖ ఛార్ట్ తయారుచేసింది. మొత్తం 35 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచ్‌లు పూర్తి అవగాహన పెంచుకునేందుకు తెలుగులో ముద్రించిన పుస్తకాలను అధికారులు ఇప్పటికే గ్రామాలకు తరలించారు. వీరి శిక్షణా కార్యక్రమాలు ముగియగానే ఉపసర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.