ప్రతి రోజు 700 ఈవీఎంల తనిఖీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతి రోజు 700 ఈవీఎంల తనిఖీలు

హైద్రాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నగరంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కాస్త ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ఎం 3 మోడల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల చెకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ సీలును తొలగించి ఈవీఎంలను పరీక్షించారు. నగరంలోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో బల్దియా అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. 


 ప్రతి రోజు 700 ఈవీఎంల తనిఖీలు

రోజుకి కనీసం 700 ఈవీఎంలను తనిఖీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ చెకింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను కూడా నియమిచారు. పర్యవేక్షకులుగా అద్వైతకుమార్ సింగ్, సందీప్ ఝా, క్రీడల విభాగం డైరెక్టర్ శశికిరణాచారిలను నియమించినట్లు కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు కల్గిన ఈ ఈవీఎంలను ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చెకింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 15రోజులు పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వివరించారు. కోర్టు కేసులున్న పలు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ చెకింగ్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందుతుందని తెలిపారు. దీంతోపాటు సీసీ కెమెరాల నిఘా, వెబ్ క్యాస్టింగ్ ద్వారా కూడా ఈ తనిఖీ ప్రక్రియ ప్రధాన ఎన్నికల అధికారికి, జిల్లా ఎన్నికల అధికారికి ఎప్పటికపుడు తెలుస్తుందని వెల్లడించారు.ఈవీఎంల చెకింగ్‌ను నాలుగు వరుసల్లో చేపడుతున్నట్లు, ప్రతి వరుసకు పది టేబుళ్లు ఏర్పాటు చేసి, వీటి ద్వారా ప్రతిరోజు కనీసం 700 ఈవీఎంలను తనిఖీ చేసేలా ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈవీఎంల తనిఖీ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారితో సహా ఇతర అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల నేతల సెల్‌ఫోన్లను కూడా లోనికి అనుమతించటం లేదు. ఈవీఎంల మొదటి దశ తనిఖీలో నమూనా ఓట్లను వేసి మాక్ పోలింగ్ నిర్వహించనున్నామని, ఇదంతా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరుగుతుందని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.