చిత్తూరు ఫిబ్రవరి 2 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంస్కృతి పేరిట చేపట్టిన వినూత్న కార్యక్రమం గ్రామీణ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులకు మన గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేసే క్రమంలో రూపకల్పన చేసిన సంస్కృతి కార్యక్రమం స్పెయిన్ పర్యాటకులను విశేషంగా అకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న దశలో మన గ్రామాలను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయటమే ధ్యేయంగా గ్రామీణ పర్యాటకానికి పెద్ద పీట వేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆకాంక్షల మేరకు వైవిధ్య భరితంగా పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమం ఈ రంగంలో నూతన శకానికి నాంది పలికింది. ఇక అసలు విషయానికి వస్తే నిజానికి వారిది పాశ్చత్య సంస్కృతి. పరదేశీయులు. పల్లె సంస్కృతి పట్ల అవగాహన అంతంత మాత్రమే. అందునా తెలుగు పల్లెల అనుభూతులు వారెన్నడూ చూడనివి. ఇప్పుడా అనుభూతిని సొంతం చేసుకున్నారు. శ్రీకాళహస్తిలో పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుని, పురాతన కట్టడాల ప్రాధాన్యతను తెలుసుకుని అచ్చెరువొందారు. ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు శ్రీకాళహస్తి హస్తకళా వైభవం చూసి ముచ్చట పడ్డారు .
అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షిస్తున్న గ్రామీణ పర్యాటకం
గత రెండు రోజులుగా స్పెయిన్ పర్యాటకులు తెలుగునాట పర్ టిస్తుండగా, శనివారం అది ముగిసింది. శ్రీకాళహస్తికి ప్రత్యేకతను సంతరింపచేసిన కలంకారిని చూసి ఈ పర్యాటకులు పులకరించారు. కళంకారీకి అంతర్జాతీయ స్థాయిలో వున్నా ప్రాముఖ్యతను కొనియాడారు. అంతే కాదు కలం పట్టి రంగులు అద్ది ఎంతో మురిసిపోయారు. చేతి పనులు నేర్చుకున్నారు. కళాకృతులు తీర్చి దిద్దటంలో సాయపడ్డారు. గ్రామీణులతో ఉత్సాహంగా ఛాయా చిత్రాలు దిగారు. ఇలా శుక్రవారం వారు శ్రీకాళహస్తి గ్రామాన్ని చుట్టి వచ్చారు. ప్రత్యేకించి పర్యాటకాంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామాలు పలు ప్రత్యేకతలను సంతరించుకున్నప్‌ాటికీ అవి పూర్తి స్ధాయిలో ప్రచారానికి నోచుకోలేదు. దీనిని అధిగమించే క్రమంలో ప్రత్యేకంగా 12 గ్రామాలను నాలుగు సమూహాలుగా విభజించిన పర్యాటక శాఖ అక్కడ “సంస్కృతి” కార్యక్రమానికి నాంది పలికింది. ఇది ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో కొనసాగుతుండగా, తిరుపతి సమూహంలోని శ్రీకాళహస్తిలో స్పెయిన్ పర్యాటకులు మారియోన, ఇలుక్ మన తెలుగు వారి ఆత్మీయతను స్వానుభవం ద్వారా అస్వాదించారు.సాధారణంగా ఇవన్ని సగటు తెలుగువారికి కొత్త కాకపోవచ్చు. ముందెన్నడూ చూడని పరదేశీయిలకు మాత్రం ఇవి ఆహ్లాదకరమే. ఈ అంశం అధారంగా చేసుకునే సంస్కృతి కార్యక్రమానికి రూపకల్పన చేసామని పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి సమూహంలో శ్రీకాళహస్తి, మాధవమాల, వెంకటగిరి గ్రామాలను చేర్చగా, అనంతపురంలో ఈ ప్రాజెక్టు కింద లేపాక్షి, నిమ్మలకుంట, వీరాపురం గ్రామలను రాజమండ్రి క్లస్టర్‌లో దిండి, నర్సాపూర్, ఉప్పాడ ఉండగా, చిత్తూరు జిల్లాలోనే మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేసే క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ తరహా పర్యాటక ప్యాకేజీ వల్ల జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడించగలవని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. సాధారణంగా పర్యాటకులు తమ సందర్శనలలో పలు అంశాలను నయనానందకరంగా చూడగలుగుతారు తప్ప భౌతికంగా అనుభూతిని పొందలేరని దీనిని అధికమిస్తూ సంస్కృతి ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు.చేనేత వస్త్రాలను వారే నేయగలిగేలా ఏర్పాట్లు ఉంటాయని, కుండల తయారీ దగ్గర వారే వాటిని తయారు చేసుకోవచ్చని, ప్రతి అంశాన్ని స్వీయ అనుభవంతో ముడిపెట్టామని,ఆంధ్రప్రదేశ్ పర్యాటక అధారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా తెలిపారు ఇలా వారికి అనుభూతిని పంచేలా దీని రూపకల్పన ఉందని ఇందుకోసం గ్రామ చరిత్రను అధ్యయనం చేసి పూర్తి వివరాలను పర్యాటకులకు అందిస్తామన్నారు. గ్రామీణులకు ప్రత్యేకంగా శిక్షణను కూడా ఇస్తున్నామని, అతిధ్యానికి సంబంధించిన మెళుకువలు, గైడ్‌లుగా ఏలా వ్యవహరించాలి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. పర్యాటకులు గ్రామీణుల నివాసాలలోనే బస చేస్తారని, అయితే మలి దశలో ప్రతి గ్రామంలోనూ ఒక కార్యకలాపాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. అయా గ్రామాలలో నడకతో చిరు పర్యటన ద్వారా అంతా చూడగలిగేలా స్పష్టమైన ప్రణాళిక ఉంటుందన్నారు.
Tags:
telangananews