కౌలు రైతులకోసం ప్రత్యేక పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కౌలు రైతులకోసం ప్రత్యేక పథకం

గుంటూరు, ఫిబ్రవరి 19, (way2newstv.com)
రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దీనికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేసింది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. కేంద్రం ప్రకటించిన పీఎం-కిసాన్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదు. అయినా రాష్ట్రం సొంతంగా సాయం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,350 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పంట రుణాలతోపాటు రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలోనూ ప్రభుత్వం వీరికి ప్రాధాన్యమిస్తోంది.


కౌలు రైతులకోసం ప్రత్యేక పథకం

మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇప్పించింది. రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు, వ్యవసాయశాఖద్వారా కౌలుదారు పత్రాలు మంజూరు చేయించింది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందించనుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే సొంతంగా అయిదెకరాల లోపున్న రైతులకు రూ.9వేలు, అయిదెకరాల పైబడిన వారికి రూ.10వేలు ఇస్తుండగా.. సెంటు భూమి లేని కౌలు రైతులకు ఏకంగా రూ.15,000 చొప్పున ఇవ్వనుంది.రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం గుర్తించిన 15.50 లక్షల మంది కౌలు రైతుల్లో సెంటు భూమి లేని వారు సుమారు 9 లక్షల వరకు ఉంటారని అంచనా. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు కేంద్ర పథకానికి అర్హులుగా గుర్తించింది. వీరందరికీ కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో మరో రూ.9 వేలను చెల్లించనుంది. మొత్తం రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలు ఉండగా కేంద్ర నిబంధనల ప్రకారం ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 54 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన 16 లక్షల మంది రైతులు ఈ పథకానికి కేంద్ర నిబంధనల ప్రకారం అర్హులు కారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 16 లక్షల మంది రైతు కుటుంబాలను సైతం ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వీరందరికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని కేంద్రంతో సంబం ధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. మార్చిలోగా మొదటి విడత రూ.4 వేల ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రెండు దఫాలుగా ఈ చెల్లింపులు జరపనున్నారు. రబీ, ఖరీఫ్‌ల వారీగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనుంది. కేంద్ర సాయం పొందే రైతులకు తొలివిడతగా రూ.4 వేలను అందిస్తారు. అదే విధంగా కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు రూ. 5 వేలు తొలివిడతగా చెల్లించనున్నారు. వీరందరి ఖాతాలకు నేరుగా నగదు జమ అయిందని నిర్ధరణ అయ్యాక మార్చిలో మిగిలిన రూ.3వేలు బదిలీ చేస్తారు. ఖాతా సంఖ్యలు సరిగా లేని, వివరాలు అందుబాటులో లేని వారిని కూడా గుర్తించి వెంటనే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.