లే ఔట్లుగా మారుతున్న పంట పొలాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లే ఔట్లుగా మారుతున్న పంట పొలాలు

విజయనగర్, ఫిబ్రవరి 12, (way2newstv.com)
సాగునీటి చెరువులను సైతం అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు. నర్సీపట్నం పురపాలికలోని బలిఘట్టం కంభాల చెరువు గర్భంలో కొద్దిరోజులుగా నాలుగు జేసీబీలు, నలభై ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. పగలు, రాత్రి నిర్భయంగా తవ్వకాలు సాగించడం వెనుక కొంతమంది రియల్ వ్యాపారుల పన్నాగం ఉంది. ఇప్పటికే వేల క్యూబిక్కు మీటర్ల మట్టి తరలించుకుపోయారు. ఈ మట్టి అంతా పొలాలను ఇళ్లస్థలాలుగా మార్చి అమ్ముకోవడానికి వీలుగా మట్టితో ఎత్తు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల వైకూడలి నుంచి జోగునాథునిపాలెం వరకు రోడ్డుని మూడుకోట్ల రూపాయల ఖర్చుతో వెడల్పు చేయించారు. ఒక్కసారిగా ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. 


 లే ఔట్లుగా మారుతున్న పంట పొలాలు

దీంతో ఈ రోడ్డుని అనుకున్న అనేకమంది తమ పొలాలను లే-అవుట్‌లుగా మార్చి అమ్ముకోవడానికి వీలుగా చెరువు మట్టిని తరలించుకుపోయారు.కంభాల చెరువు కింద బలిఘట్టంలో ఎనభై ఎకరాల ఆయకట్టు ఉంది.  చెరువు గర్భం 20.2 ఎకరాలు. గత ఏడాది నీరు-చెట్టు కింద పదెకరాల్లో నాలుగు అడుగుల లోతున దాదాపు పద్దెనిమిదివేల క్యూబిక్కు మీటర్ల మేర పూడిక తీసి గట్టుని పటిష్ఠపరిచారు. లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి గట్టుని పటిష్ఠపరిస్తే అక్రమార్కులు ఇప్పుడు ఆ గట్టుని సగానికి తెగ్గొట్టేసి మట్టిని తరలించుకుపోయారు. నిన్నటి వరకు  ఎదురెదురుగా వచ్చే ట్రాక్టర్లు తప్పుకోవడానికి వీలైనంత గట్టు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. తెగ్గొట్టిన గట్టుపై నుంచి చెరువులో తమ పశువులు పడిపోయే ప్రమాదం ఉందని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారుతవ్వకాలు సాగించినవారు కూడా ఇష్టానుసారం వ్యవహరించారు. ఒక్కో జేసీబీతో పదేసి ట్రాక్టర్లు పెట్టి ఒక్కో మూలన తవ్వకాలు చేశారు. జలవనరుల శాఖ పూడికతీత పనులు చేపట్టినప్పడు సాగునీటి నిల్వకు, ప్రవాహానికి వీలుగా తవ్వకాలు చేపట్టేది. ప్రైవేట్‌ వ్యక్తులు ఇష్టానుసారం అడ్డదిడ్డంగా లోతైన గోతులు తవ్వేస్తున్నారు. ఈ చెరువుకు రావణాపల్లి జలాశయం నీరు వస్తుంటుంది. చెరువు మట్టి ఎంతో సారవంతమైంది. రైతులు ఉగాది తర్వాత చెరువు మట్టిని తమ పొలాల్లో వేసుకుని వేసవి దుక్కులు సాగిస్తారు. రైతులకు ఉపయోగపడాల్సిన సారవంతమైన మట్టి వ్యాపార అవసరాలకు తరలిపోయింది. దాదాపు పదిహేను రోజులుగా పగలూ, రాత్రి తవ్వకాలు సాగుతున్నాయంటే అధికారులకు తెలియకుండా జరగదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.బలిఘట్టం వై కూడలి నుంచి జోగునాథునిపాలెం వరకు పంట భూములన్నీ ఇళ్లస్థలాల ...కోసం ఎప్పుడో చేతులు మారాయి. చాలామంది లే-అవుట్‌లు వేసి ఇళ్లస్థలాలుగా ఆమ్ముకోవడానికి పొలాలను కొనుగోలు చేశారు. ఇక్కడి రోడ్డు ఏకంగా 24 అడుగులకు విస్తరించడంతో పాటు ట్రాఫిక్కుని ఇటు మళ్లించడంతో రోడ్డు వెంబడి రద్దీ పెరిగింది. దీంతో తమ స్థలాలకు గిరాకీ వస్తుందని ఊహించిన పొలాల కొనుగోలుదారులు మట్టి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు దగ్గర్లోని కంభాల చెరువుపై అందరి దృష్టిపడింది. రోడ్డుకు దగ్గరగా ఉండడంతో ట్రాక్టర్ల రాకపోకలకు అనువుగా ఉంది. దీంతో ఒక్కో ట్రాక్టరు యజమాని రోజుకు 30 లోడ్లు వరకు మట్టి తరలించి అమ్ముకున్నారు. కొందరు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని మరీ మట్టిని అమ్ముకున్నారు. ఇష్టానుసారం తవ్వకాలు సాగించిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చెరువుగర్భంలో అడ్డగోలు తవ్వకాలను సరిచేయించాలని, బలహీనపర్చిన చెరువు గట్టుని పునరుద్ధరించాలని కోరుతున్నారు. వెంటనే తవ్వకాలను ఆపించాలంటూ సిబ్బందికి కబురు చేశారు. అక్రమ తవ్వకాల విషయం తహసీల్థార్‌ వి.వి.రమణ దృష్టికి తేగా స్పందించిన ఆయన సిబ్బందిని పంపించారు. అప్పటికే రెండు జె.సి.బి.లు, ట్రాక్టర్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తాము వివరాలు తెలుసుకుంటామని తహసీల్దార్‌ వివరించారు.