అమ్మ ప్రసాదంపై అంత నిర్లక్ష్యమా..? (విజయవాడ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మ ప్రసాదంపై అంత నిర్లక్ష్యమా..? (విజయవాడ)

విజయవాడ, ఫిబ్రవరి 12(way2newstv.com): దుర్గగుడిలో నిత్యాన్నదాన పథకం అమలు తీరుపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. దాతలు ఇచ్చిన విరాళాలతో దూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. భక్తులు కూడా అన్నప్రసాదాన్ని దైవస్వరూపంగా భావించి తింటారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి రోజు 5 వేల మందికి అన్నప్రసాద వితరణ చేయాలి. ప్రస్తుతం మల్లికార్జున మహా మండపంలో 4 వేల మందికి అన్నదానం చేసిన పరిస్థితులు లేవు. ముఖ్యంగా కాంట్రాక్ట్ సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.


అమ్మ ప్రసాదంపై అంత నిర్లక్ష్యమా..?  (విజయవాడ)

అన్నపూర్ణగా కీర్తించే దుర్గమ్మను ధ్యానించిన తరువాతే భక్తులు అన్నప్రసాదం తీసుకునే విధంగా గతంలో సిబ్బంది మైకులో చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ సిబ్బంది వండామా? వార్చామా? అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మల్లికార్జున మహా మండపం రెండో అంతస్తులో రెండు హాల్స్‌ అన్నప్రసాద పంపిణీకి కేటాయించారు. మూడో అంతస్తులో క్యూలైన్లో ప్రవేశించిన భక్తులను క్రమపద్ధతిలో పంపి రెండో అంతస్తులోని రెండు హాళ్లకు పంపాలి.  ఇటీవల ఓ రోజు క్యూలైన్లో భక్తులు  తక్కువగా ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా దిగువన ఉన్న మొదటి హాల్లో 250 ప్లేట్లలో కూర, పప్పు, పులిహోర, అన్నాన్ని సిబ్బంది ముందుగానే వడ్డించారు. రెండో హాల్లో 150 మందికి ఇదేవిధంగా ప్లేట్లల్లో వడ్డించారు. రెండో హాలు చిన్నది కావడంతో ముందుగా దానిలోకి భక్తులను పంపితే 75 మంది వచ్చారు. ఆ సమయంలో క్యూలైన్లో పది మంది భక్తులు కూడా లేరు. అక్కడ ఉన్న సిబ్బంది ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తం 400 ప్లేట్లలో వడ్డన చేసి భక్తుల కోసం కూర్చున్నారు.
క్యూలైన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి, హాల్లో వడ్డన చేస్తున్న వారికి సమన్వయం చేసేందుకు ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. అన్నప్రసాద పంపిణీ చేసే సమయంలో గుమస్తా, సూపరింటెండెంట్‌, ఏఈవోల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వేలిముద్రలు తీసుకునే కేంద్రాలు మూడు చోట్ల ఏర్పాటు చేశారు. దాంతో ఎవరు అన్నప్రసాదానికి వస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తిరుమలలో అన్నప్రసాదం వడ్డించే సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో భక్తులకు వడ్డిస్తారు. ఇక్కడ జీన్స్‌ ప్యాంట్లు, రంగు రంగుల చొకాలు ధరించి కాంట్రాక్ట్ సిబ్బంది వడ్డన చేస్తున్నారు. భక్తి భావం మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి అన్నదాన కేంద్రంలో ఉంది.