కాంగ్రెస్ హోదా ప్రకటనతో వైసీపీలో టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ హోదా ప్రకటనతో వైసీపీలో టెన్షన్

నెల్లూరు, ఫిబ్రవరి 10, (way2newstv.com
ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. తమ ఓటుబ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తూ కలవరపడుతున్నారట. ఏ మేరకు ఓట్లు చీలుతాయోనని లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఓటుబ్యాంక్ గతంలో కాంగ్రెస్ పార్టీది కావడమే ఈ పరిణామానికి కారణం. రాష్ట్ర విభజన విషయంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌పార్టీపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించారన్న కసిని గత ఎన్నికల్లో ఓట్లరూపంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చట్టసభలకు పంపలేదు. 


 కాంగ్రెస్ హోదా  ప్రకటనతో వైసీపీలో టెన్షన్

అసలు రాష్ట్రంలో చాలాచోట్ల హస్తంపార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇదే సమయంలో వైసీపీకి కాంగ్రెస్ నుంచి గణనీయంగా ఓటుబ్యాంక్ బదిలీ అయింది. నాలుగేళ్లు తిరిగే సరికి సీన్‌ మారిపోయింది. టీడీపీ, బీజేపీల మధ్య మైత్రీబంధం తెగిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు వ్యూహం మార్చారు. కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ- కాంగ్రెస్‌పార్టీల పొత్తు కొనసాగుతుందనీ, అదే జరిగితే తాము లాభపడతామనీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్‌పార్టీ తాజాగా ప్రకటించింది. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు డీలాపడ్డారు. ఇదిలా ఉంటే, తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు కూడా అమలుచేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల తమ ఓటుబ్యాంకుకి గండి పడుతుందని విశాఖ వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలు వైసీపీ వారిని తెగ కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పరిణామం హస్తంపార్టీకి కలిసివస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ విభజనను గతంలో ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. అందుకే ఇందిర పట్ల ఏపీ ప్రజల గుండెల్లో ఎంతో ప్రేమ గూడుకట్టుకుంది. అచ్చం నాయనమ్మ పోలికలతో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి రావడాన్ని ఏపీలో కాంగ్రెస్ శ్రేణులు సహా అభిమానులంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో.. ఎన్నికల ప్రచారం కోసం ఏపీలో ప్రియాంక పర్యటిస్తే తమ ఓటుబ్యాంక్‌పై ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల ఓట్లకు గండిపడుతుందనే భావన వారిలో బలంగా ఉంది. చూద్దాం ఈ పరిణామాలు అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయో!