అమరావతి ఫిబ్రవరి 15 (way2newstv.com)
సీనియర్ ఐఎఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ నిర్వహణ సంచాలకులుగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం కలెక్టర్గా సేవలు అందించిన ధనుంజయ రెడ్డి ఇటీవలి బదిలీలలో భాగంగా ఎపిటిడిసి ఎండిగా నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన సచివాలయానికి చేరుకుని పర్యాటక, భాషా సాంస్కృతిక, పురవస్తు శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఎపిటిడిసి ఎండిగా బాధ్యతలు తీసుకున్నధనుంజయరెడ్డి
సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఆరు సంవత్సరాలు జిహెచ్ఎంసి అదనపు కమీషనర్గా వ్యవహరించిన రెడ్డి తన హయాంలో జరిగిన హైదరాబాద్ రహదారుల విస్తరణలో కీలక భూమిక పోషించారు. తొలుత ఆరోగ్యశ్రీ సిఇఓగా బాధ్యతలు నిర్వహించగా, తదుపరి విపత్తుల నిర్వహణ కమీషనర్గా పనిచేసారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా పనిచేసి పుష్కర యాత్రికుల మన్ననలు అందుకున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులుగా రైతు ప్రయోజనాలే ప్రాతిపదికగా పనిచేసారు. శ్రీకాకుళం కలెక్టర్గా విభిన్న వర్గాలకు దగ్గరయ్యారంటే అతి శయోక్తి కాదు. రైతు పక్షపాతిగా వంశధార నిర్వాశితులకు పరిహారం చెల్లింపు విషయంలో తనదైన ముద్రను చూపారు. వందలాది కుటుంబాలు సాంకేతిక కారణాలతో పరిహారం అందుకోలేని పరిస్ధితి నెలకొన్న స్ధితిలో వారందరికీ పరిహారం అందేలా చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ధ్యేయంతో ధనుంజయ రెడ్డి చూపిన చొరవ సత్ ఫలితాలను ఇచ్చింది. మరో వైపు ఉద్దానం కిడ్నీ బాధితులకు అసరా కల్పిస్తూ రూ.500 కోట్లతో రూపొందించిన మంచినీటి సరఫరా ప్రాజెక్టు టెండర్ల దశను పూర్తి చేసుకుంది. మంచినీటి కారణంగానే మూత్రపిండాల వ్యాధులు వస్తున్నాయన్నది నిజమైతే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఎపిటిడిసి ఎండిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో గత రెండు సంవత్సరాలుగా పర్యాటక రంగం పరుగులు పెడుతుందని, విభిన్న జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిందన్నారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో తన వంతు కృషి చేస్తానని, ఈ క్రమంలో సిబ్బంది సహకారం అశిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు లక్ష పర్యాటక అతిధి గదుల లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
Tags:
Andrapradeshnews