19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

మాఘశుద్ధ పౌర్ణమి ముహూర్తం ఖరారు
హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (way2newstv.com
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కేబినెట్‌ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. 


19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

గవర్నర్‌తో సీఎం భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కేబినెట్‌ విస్తరణపై ప్రకటన వెలువడింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు.మరోవైపు కేబినెట్‌ కూర్పుపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 16 మందినీ తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొంతమందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటు కల్పించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్‌లో చోటు దక్కించునే విషయంలో కొందరు నేతల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, కొప్పుల ఈశ్వర్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.