ఖమ్మం పార్లమెంట్ పై కాంగ్రెస్ గురి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖమ్మం పార్లమెంట్ పై కాంగ్రెస్ గురి

ఖమ్మం, ఫిబ్రవరి 13, (way2newstv.com)
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన సానుకూలతను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వినియోగించి మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడం వల్ల నష్టపోయామని గ్రహించిన పార్టీ నాయకత్వం ఈ నెల 15 వరకు పార్లమెంటుకు పోటీ చేయాలనుకున్న వారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. వాటిలో నుంచి ఈ నెల 20లోగా ఒక జాబితాను రూపొందించి పార్టీ అధినేత రాహుల్ గాంధీ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు ఔత్సాహికుల సంఖ్య అధికంగా ఉంది. 


ఖమ్మం పార్లమెంట్ పై కాంగ్రెస్ గురి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందిన నేపథ్యంలో పార్లమెంట్‌కు గెలుపు సులభమవుతుందనే లక్ష్యంతో పోటీ చేయాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి బలంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎల్పీ నేతగా ఉన్న భట్టివిక్రమార్కతో పాటు కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి రేణుకాచౌదరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ అర్బన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన గ్రానైట్ వ్యాపారి గాయత్రి రవి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు సినీనటి విజయశాంతి కూడా ఖమ్మం బరిలో ఉంటారని సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు ఖమ్మం నగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల పేర్లను భట్టివిక్రమార్క సూచిస్తున్నారని కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. కాగా మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎస్టీ సెల్ కోచైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు ఉన్నతాధికారులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన మరో ఇద్దరి పేర్లుకూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఆరుగురు, కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన టీడీపీ రెండు స్థానాల్లోనూ విజయం సాధించాయి.ఓటుబ్యాంకు పరంగా పార్టీకి బలముందనే కారణంతో ఖమ్మంలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్, టీడీపీ కూటమికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5.36 లక్షల ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 4.33లక్షల ఓట్లు వచ్చాయి. మిగిలిన 1.03 లక్షల ఓట్లు ఆధిక్యతలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు లెక్కలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బలమైన నేత ఉంటారని, అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను పోటీకి దింపేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది