తెలుగు తమ్ముళ్ల తగువులాటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగు తమ్ముళ్ల తగువులాటలు

గుంటూరు, ఫిబ్రవరి 14, (way2newstv.com)
గుంటూరు జిల్లా టిడిపిలో అసమ్మతి రాజకీయాలు తీవ్రరూపు దాలుస్తున్నాయి. సిటింగ్‌లకు టిక్కెట్లు రాకుండా అసమ్మతి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాడికొండ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటికే అసమ్మతి తీవ్రంగా ఉంది. దీంతో తాను ఈసారి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయనని, నర్సరావుపేట ఎంపి లేదా బాపట్ల, మాచర్లలో అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రకటించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఇటీవల జిల్లా మంత్రుల ఎదుట తమ వాదన గట్టిగా వినిపించారు. 'గత ఎన్నికల్లో తాము చందాలు వేసుకుని శ్రావణ్‌కుమార్‌ను గెలిపించాం. మమ్మల్ని కాదని ఈ సారి మీరు టిక్కెట్టు ఇస్తే చందాలు వేసుకుని ఓడిస్తాం' అని ప్రకటించారు. 

 
తెలుగు తమ్ముళ్ల తగువులాటలు

దీంతో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు కంగుతిన్నారు. ఈ అంశాన్ని సిఎం దృష్టికి తీసుకువెళతామని ప్రకటించారు. శ్రావణ్‌కుమార్‌ను బాపట్ల ఎంపిగా పోటీ చేయిస్తే ఎలా ఉంటంందనే అంశంపై అధిష్టానం వద్ద పలువురు నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ స్థానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను పోటీ చేయించాలని టిడిపిలో ఒక బలమైన గ్రూపు ప్రతిపాదిస్తోంది. గతంలో తాడికొండ నుంచి రెండుసార్లు గెలిచిన ఆయనకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు. దీంతో వరప్రసాద్‌ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపి రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట నుంచి అవకాశం కల్పించకుంటే తన కుమారుడు రాయపాటి రంగారావుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. రంగారావుకు పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నుంచి అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులు టిడిపి టిక్కెట్‌ ఆసిస్తున్నారు. పెదకూరపాడు సిటింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను కాదని రంగారావుకు అవకాశం ఇస్తారా? అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో ఉంది. మరోవైపు టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రెండు నెల్ల కిందటే రాజీనామా చేసిన మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు స్థానంలో దళిత నాయకుడ్ని ఎవర్నీ ఇన్‌ఛార్జిగా ప్రకటించలేదు. ఇక్కడి పార్టీ బాధ్యతలు మాజీ మంత్రి గల్లా అరుణ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు తూర్పు, బాపట్ల, నర్సరావుపేట, మాచర్ల, మంగళగిరి నియోజకవర్గాల్లో టిడిపి ఇన్‌ఛార్జిలుగా పనిచేస్తున్న ఐదుగురిలో ఒక్కరికీ టిక్కెట్లు దక్కవనే ప్రచారం ఉంది. ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం టిడిపి అన్వేషిస్తోంది.రానున్న ఎన్నికల్లో తమ వారుసులకు ప్రాధాన్యతనివ్వాలని సీనియర్‌ నేతలు పట్టుపడుతున్నారు. తమతో పాటు తమ కమారులకు అవకాశం ఇవ్వాలని కొంత మంది పట్టుబడుతుండగా, తమకు కాకపోతే తమ కుమారులకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి టిడిపిలో చేరిన రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట ఎంపిగా పోటీచేసి విజయం సాధించారు. గతంలో ఆరుసార్లు ఎంపిగా గెలుపొంది జిల్లా రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ నేతగా ఉన్నారు. వయోభారం, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ను ఈ సారి పోటీ నుంచి తప్పించాలని టిడిపి అధిష్టానం ప్రయత్నిస్తోంది. అయితే తనకు అవకాశం ఇవ్వకపోతే తన కుమారుడు రాయపాటి రంగారావుకు ఎంపి లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సాంబశివరావు అధిష్టానాన్ని కోరుతున్నారు. రంగారావును టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై టిడిపి సర్వే చేస్తున్నట్లు తెలిసింది. సిట్టింగ్‌లను ఎవరినైనా తప్పిస్తేనే రంగారావుకు అవకాశం రావచ్చని అంటున్నారు. అలాగే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ గత ఐదేళ్లుగా నర్సరావుపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్నారు. తాను నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానని, తన కుమారునికి సత్తెనపల్లి టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. బాపట్ల నుంచి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. కానీ వయోభారం దృష్ట్యా తన కుమారుడు గాదె మధుసూధనరెడ్డికి అవకాశం ఇవ్వాలని వెంకటరెడ్డి కోరుతున్నారు. నర్సరావుపేట ఎంపిగా రాయపాటికి ఇవ్వని పక్షంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ను పోటీకి నిలపాలని పలువురు సీనియర్‌ నాయకులు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే అధిష్టానం మాత్రం ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరంగా సమస్యలు ఉన్నాయని, అందువల్ల వారసులకు ఈ సారి పోటీకి అవకాశం ఇవ్వడంపై అన్ని కోణాల్లో ఆలోచించాల్సి ఉందని నేతలకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. వారసులకు అవకాశం ఇచ్చే విషయంలో టిడిపి అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వారసులకు ఒక చోట అవకాశం ఇస్తే మరో చోట నుంచి వత్తిడి వచ్చే అవకాశముందని, అందువల్ల మొత్తంగా ఒకే నిర్ణయం తీసుకోవడం మేలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.