గ్రేట‌ర్‌లో హ‌రిత‌హారం థీమ్‌ పార్కులు - క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రేట‌ర్‌లో హ‌రిత‌హారం థీమ్‌ పార్కులు - క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌

హైదరాబాద్ ఫిబ్రవరి 18  (way2newstv.com)  
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌నీసం 25 మేజ‌ర్ పార్కుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ న‌గ‌రవాసులకు ఆహ్లాద‌వంత‌మైన జీవ‌నం గ‌డ‌ప‌డానికి న‌గ‌రంలో మ‌రిన్ని పార్కులు ఏర్పాటు చేయాల‌ని ఇటీవ‌ల న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స్టాండింగ్ క‌మిటీలో తీర్మానించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్‌లో ఐదు ఎక‌రాలకుపైబ‌డి ఖాళీగా ఉన్న స్థ‌లాల‌ను గుర్తించాల‌ని  జోన‌ల్ క‌మిష‌న‌ర్లను క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశించారు.


గ్రేట‌ర్‌లో హ‌రిత‌హారం థీమ్‌ పార్కులు - క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌
దీనిలో భాగంగా నేడు క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల‌లోని ఖాళీ స్థలాల‌ను చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ముఖ్యంగా రోడ్ నెం-11 నుండి రోడ్ నెం- 36 వ‌ర‌కు  క‌మిష‌న‌ర్ ప‌ర్య‌టించి ఖాళీ స్థ‌లాలు, పార్కుల ఏర్పాటుకు అనువుగా ఉన్న స్థ‌లాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ న‌గ‌రంలోని ప్ర‌తి జోన్ ప‌రిధిలో క‌నీసం ఐదు మేజ‌ర్ పార్కుల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఇందుకు ఖాళీ స్థ‌లాల‌ను వెంట‌నే గుర్తించి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించిన‌ట్టు పేర్కొన్నారు. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న ఈ పార్కుల‌ను హ‌రిత‌హారం పార్కులుగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న ఈ పార్కుల‌కు సంబంధించి అంచ‌నా వ్య‌యాలు రూపొందించడంతో పాటు పార్కుల ప్లాన్‌ల‌ను త‌గు అనుమ‌తుల‌కై స‌మ‌ర్పించాల‌ని కోరిన‌ట్టు చెప్పారు. న‌గ‌రంలో మెరుగైన జీవ‌న విధానం క‌ల్పించేందుకుగాను లంగ్ స్పేస్‌ల‌ను కొన‌సాగించేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా రోడ్ నెం-11లో రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు.