సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిషి కుమార్‌ శుక్లా

న్యూఢిల్లీ ఫిబ్రవరి 4 (way2news.com)
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్‌ శుక్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలోక్‌ వర్మను తప్పిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత శుక్లాను నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మను తప్పించారు. ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించారు. నూతన డైరెక్టర్‌ను నియమించేందుకు ఇటీవల సమావేశమైన మోదీ నేతృత్వంలోనే కమిటీ శుక్లాను ఎంపిక చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 


 సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిషి కుమార్‌ శుక్లా 

1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి శుక్లా సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పశ్చిమ బెంగాల్‌ సమస్య సవాల్‌గా మారింది. శారదా కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో కోల్‌కతా కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు నిన్న ఆయన ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ మంగళవారం జరగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ సీఎం మమతాబెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ ధర్నా కొనసాగుతోంది.
Previous Post Next Post