జీహెచ్ఎంసీకి 9 ఎల‌క్ట్రిక్ స్వ‌చ్ఛ ఆటోల‌ను అందించిన ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీహెచ్ఎంసీకి 9 ఎల‌క్ట్రిక్ స్వ‌చ్ఛ ఆటోల‌ను అందించిన ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్

హైదరాబాద్, మార్చ్ 5 (way2newstv.com )  
హైద‌రాబాద్ నగర సుంద‌రీకరణ, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావాల్సిందిగా కార్పొరేట్ సంస్థ‌ల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటిలో భాగంగా ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా జీహెచ్ఎంసీకి రూ. 22ల‌క్షల విలువైన 9 ఎల‌క్ట్రిక్ స్వ‌చ్ఛ ఆటోల‌ను నేడు అంద‌జేసింది. ప‌వ‌ర్ గ్రీన్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో నేడు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఈ స్వ‌చ్ఛ ఆటోల‌ను జెండా ఊపి క‌మిష‌న‌ర్ ప్రారంభించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచందన, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌ఘుప్ర‌సాద్, ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్ అధికారులు ఎం.ఏ.ర‌వీంద‌ర్, సుశీల‌దేవి, ర‌మ‌న్‌కుమార్ త‌దిత‌రులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ కోటి మందికిపైగా జ‌నాభా, 650 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లకు పైగా విస్తీర్ణం ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రవాసుల‌కు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలు అందించ‌డం, మెరుగైన జీవన ప్ర‌మాణాలు క‌ల్పించ‌డానికి జీహెచ్ఎంసీ శాయాశ‌క్తులా కృషిచేస్తున్న‌ప్ప‌టికీ కార్పొరేట్ సంస్థల భాగ‌స్వామ్యం కూడా అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 


జీహెచ్ఎంసీకి 9 ఎల‌క్ట్రిక్ స్వ‌చ్ఛ ఆటోల‌ను అందించిన ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్

స్వాతంత్రం సిద్దించిన ఆరు ద‌శాబ్దాల అనంత‌రం స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డానికి ఉద్దేశించి ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం గొప్ప కార్య‌క్ర‌మం అని అన్నారు. ప్రజల భాగ‌స్వామ్యం ద్వారానే ప‌రిస‌రాల ప‌రిశుభ్రత, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల అమ‌లు స‌మ‌ర్థ‌వంతంగా సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్ట‌డానికి ప్ర‌తి స‌ర్కిల్‌కు ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌ను నియ‌మించనున్నామ‌ని, ఈ స్వ‌చ్ఛంద సంస్థ‌లు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి పారిశుధ్య కార్య‌క్ర‌మాలు నిరంత‌రం స‌మ‌ర్థ‌వంతంగా అమ‌ల‌య్యేలా ప‌ర్య‌వేక్షిస్తాయ‌ని పేర్కొన్నారు. కేవ‌లం స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ పోటీల స‌మ‌యంలోనే స్వ‌చ్ఛ‌త‌పై ప‌నిచేయ‌కుండా నిరంత‌రం స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను ప‌టిష్టంగా అమ‌ల‌య్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌రంలో ప‌ర్యావరణ ప‌రిర‌క్షణ దృష్ట్యా ఎల‌క్ట్రిక్ ఆటోల అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, ఈ ఆటోల‌ను అంద‌జేసేందుకు ప‌వ‌ర్ గ్రీడ్ సంస్థ‌ను అభినందిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. ప‌వ‌ర్ గ్రీడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సీజిఎం ఎం.ఏ.ర‌వీంద‌ర్ మాట్లాడుతూ తమ గ్రీడ్ ద్వారా సీ.ఎస్.ఆర్ కింద సిసి కెమెరాలు, డ‌స్ట్‌బిన్‌లు అంద‌జేశామ‌ని, స్వ‌చ్ఛ భార‌త్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీకి 9 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను అంద‌జేశామ‌ని తెలిపారు.