నిజామాబాద్, మార్చి 26 (way2newstv.com):
సరైన వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. కరువు పరిస్థితులతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఉన్న ఊళ్లో చేయడానికి పనులు లేవు. దీంతో పని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు వలసవెళ్తున్నాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుతున్నాయి. బోరుబావులు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. కరువు పరిస్థితులతో నాగిరెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయభూములు బీడుగానే ఉన్నాయి. కొందరు రైతులు ధైర్యంచేసి అక్కడక్కడా వేసిన పంటలు సైతం సాగునీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం అంతంతమాత్రంగానే ఉండడంతో పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనికోసం వలస బాట పడుతున్నారు.
నిండుకుండలు వెలవెల (నిజామాబాద్)
మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్‌పేట, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాండూర్, ధర్మారెడ్డి, రాఘవపల్లి, కన్నారెడ్డి, మాసాన్‌పల్లి, ఆత్మకూర్, జలాల్‌పూర్, జప్తిజాన్కంపల్లి, బొల్లారం తదితర గ్రామాల నుంచి ప్రజలు పొట్ట చేతబట్టుకొని ఇతరప్రాంతాలకు భారీగా వలసవెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంతోపాటు ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.పేదలకు అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం ఈసారి పెద్దగా పనులు కల్పించలేకపోయింది. వరుసగా వస్తున్న ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటోంది. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సకాలంలో పనులను గుర్తించలేకపోయారు. మరోవైపు వరుణుడి కరుణ లేకపోవడంతో వ్యవసాయ పనులూ అంతంతగానే ఉన్నాయి. దీంతో గ్రామాలలో చేయడానికి పనులు లేకుండాపోయాయి. గ్రామాల్లో పనిలేకపోవడంతో చాలాకుటుంబాలు ఇళ్లకు తాళాలువేసి పట్టణాలకు వలసవెళ్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులందరికీ తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తుండగా.. మరికొంతమంది వృద్ధులు, పిల్లలను ఇంటివద్దనే వదిలి వలసబాట పడుతున్నారు. పిల్లలు చదువుకు దూరమవకూడదని, వృద్ధులు ఉంటే ఇంటికి కాపలాగా ఉంటారని భావించి కేవలం భార్యాభర్తలు మాత్రమే పనికోసం పట్టణాలకు వెళ్తున్నారు. మాల్తుమ్మెద గ్రామంలో 500లకుపైగా కుటుంబాలుండగా సుమారు వంద కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.