కడప జిల్లాలో మళ్లీ రౌడీయిజం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కడప జిల్లాలో మళ్లీ రౌడీయిజం

కడప, మార్చి 21, (way2newstv.com)
కడప నగరంలో మళ్లీ రౌడీ యిజం తలెత్తుతోంది. కొనే్నళ్లుగా వీధి రౌడీలు, జులాయిలు తగ్గిపోయి చిల్లర నేరాల సంఖ్య తగ్గింది. అయితే ఇటీవల ఏడాదిగా మళ్లీ రౌడీ యిజం మోసులెత్తి బలపడుతోంది. వీధి రౌడీలు, జులాయిలు గుంపులు గుంపులుగా నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈగ్యాంగ్‌లే చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. కొంతమంది కిందిస్థాయి పోలీసులు ఈ రౌడీల కార్యకలాపాలకు పూర్తి అండదండలు ఇస్తున్నారు. ఈ -పోలీసింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక విధానాలతో నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు అధికారులు చెప్పుకుంటున్నా, పోలీసు రికార్డులకు ఎక్కని చిల్లర నేరాలు అనేకం జరుగుతున్నాయి. రికార్డులకు ఎక్కడపోవడానికి కారణం - ఈ రౌడీలకు పోలీసులకు ఉన్న అనుబంధమే. చాలా నేరాలు పంచాయితీలుగానే వీగిపోతున్నాయి. బాధితులే అధికంగా నష్టపోతున్నారు. నేరం చేసిన రౌడీలు మాత్రం తల ఎగరేసుకుని మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ రౌడీ గ్యాంగ్‌లకు లీడర్లుగా ఉన్నవారు చదువు సంధ్యలపట్ల ఆసక్తిలేని విద్యార్థులను, చదువు ముగిసి నిరుద్యోగులుగా ఉన్నవారిని చేరదీసి నేరాలకు మరుపుతున్నారు. జేబు ఖర్చులకు డబ్బులు రావడంతో క్రమంగా ఈవిద్యార్థులు నేరస్తులుగా పరిణామక్రమం చెందుతున్నారు. పాతికేళ్ల క్రితం ఇటువంటి రౌడీ గ్యాంగ్‌లు బాహాటంగానే రోడ్లమీద సైకిల్ చైన్లతో, హాకీ బ్యాట్లతో కొట్టుకుంటూ రణరంగాలు సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత తర్వాత ఇటువంటి బహిరంగ రణరంగాలు సమిసిపోయి, వీరి నేర రూపం మార్చుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ అటువంటి వీధి రణరంగాలు ప్రారంభమయ్యాయి.  


కడప జిల్లాలో మళ్లీ రౌడీయిజం

నగరం నడిబొడ్డున పెట్రోలు బంకులో ఒక వ్యక్తిపై కొందరు రౌడీలు దాడిచేసి కట్టెలతో, చైన్లతో చావమోదారు. పెద్దముడియం అహమ్మద్ బాషా అనే వ్యక్తిపై, పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా గుర్తింప బడిన వినయ్‌కుమార్‌రెడ్డి అతని గ్యాంగ్ దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదై, సోమవారం వారిని కోర్టుకు హాజరుపెట్టారు. కేసులో నమోదైన 21మంది నిందితుల్లో ఎంబిఏ చేసిన ఇద్దరు నిరుద్యోగులు, బిటెక్ చేసిన ఇద్దరు నిరుద్యోగులు మరో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఈ సంఘటన నేపధ్యమే గ్యాంగ్ లీడర్లు విద్యార్థులను, నిరుద్యోగులను నేరాలవైపు మళ్లిస్తున్నారనేందుకు బలమైన ఉదాహరణ. ఎస్పీ హయాంలో ఇటువంటి రౌడీయిజంపై చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. చిల్లర నేరాలకు పాల్పడినట్లు తెలియగానే, అటువంటి నేరస్తులపై చాలా కఠినమైన కేసులు నమోదు చేయడమేగాకుండా, కౌనె్సలింగ్ పేరుతో జన్మలో రౌడీ యిజానికి పాల్పడకుండా కోటింగ్ ఇచ్చారు. దీంతో చిల్లర మల్లర నేరాలన్నీ మూతపడ్డాయి. అంతేగాకుండా ఈ రౌడీలతో సంబంధాలున్న పోలీసులను గత ఎస్పీ నిర్థాక్షిణ్యంగా సస్పెండ్ చేయడం, ఊస్టింగ్ చేయడం చేశారు. దీంతో పోలీసులు కూడా రౌడీలతో సంబంధాలు తెంచుకున్నారు. గత ఏడాదిగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అంతకుముందు అలవాటుపడిన పోలీసులే మళ్లీ రౌడీలకు ఊపిరి పోశారు. చైన్ స్నాచింగ్ నేరాలు, లాక్‌చేసిన ఇళ్లల్లో దొంగతనాలు, తమను ఆశ్రయించిన వారి నుండి డబ్బుతీసుకుని వారి శతృవులపై దాడిచేయడం, వారి శత్రువుల వాహనాలు తగలబెట్టడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో నివాసం లేని వారి స్థలాలు ఆక్రమించి దౌర్జన్యం చేయడం, ఆ యజమానుల నుంచే డబ్బుగుంజి ఖాళీ చేయడం వంటి నేరాలకూ పాల్పడుతున్నారు. వీటన్నింటి వెనుక కొంతమంది పోలీసుల అండదండలు ఉన్నాయి. ఇప్పుడు పట్టుబడిన వినయ్‌కుమార్‌రెడ్డి లాంటి రౌడీ షీటర్ల ఫోన్ డేటాను బయటకు తీస్తే పోలీసుల నెంబర్లు, వారితో మాట్లాడిన సంభాషణలు కూడా బయటకు వస్తాయి. అయితే పోలీసు అధికారులు ఆ పనిచేయరనే విమర్శలు ఉన్నాయి.ఇటీవల పోలీసులు కేవలం ద్విచక్రవాహనాలు, ఆటోల తనిఖీల్లోనే తలమునకలై పోయారు. అటు ప్రభుత్వానికి ఇటు తమకు లాభసాటిగా ఉన్న ఈకార్యక్రమంపై పోలీసులకూ మోజుపెరిగింది. రాత్రి 9గంటలు దాటితే ఆటో డ్రైవర్లు ఆటో నడుపుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఏదో ఒక సాకుతో వేలకు వేలు ఫైన్‌వేసి డబ్బు గుంజుతున్నారనే భయం ఆటోడ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు క్షణ క్షణం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం కూడా ఇటువంటి సులభ ఆదాయానికి మరిగి, పోలీసుశాఖను, రవాణాశాఖను కేవలం వాహనాలపై ఫైన్‌వేసేందుకే ప్రోత్సహిస్తోంది. వాహనాల తనిఖీల్లో టార్గెట్ పెట్టి మరీ డబ్బు వసూళ్లు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ తనిఖీలపై దృష్టిపెట్టిన పోలీసు అధికారులు, ఇతరత్రా చిల్లర మల్లర నేరాలపై దృష్టి పెట్టకపోవడంతో, కిందిస్థాయి పోలీసులు, రౌడీలు కుమ్మక్కై నగరాన్ని రౌడీ రాజ్యంగా మారుస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి.