ఐదుగురు మినిస్టర్లకు సీట్లు హుళుక్కే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదుగురు మినిస్టర్లకు సీట్లు హుళుక్కే

విజయవాడ, మార్చి 13, (way2newstv.com)
పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. సుమారు 130 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల నేతలను పార్టీ అధిష్ఠానం అమరావతికి పిలిపించింది. యనమల, సుజనాచౌదరి ఆధ్వర్యంలోని రెండు సమన్వయ కమిటీల ద్వారా ఆయా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వైసీపీ, టీడీపీ కసరత్తు ముమ్మరం చేశాయి.అయితే... ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం టీడీపీలోని ఐదుగురు మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. 


ఐదుగురు మినిస్టర్లకు సీట్లు హుళుక్కే

మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావులను ఎంపీలుగా పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. అయితే.. ఎంపీలుగా పోటీ చేయడానికి ఈ ఇద్దరు మంత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ప్రచారంలో ఉండగానే శిద్దా అనుచరులు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆయన ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు శిద్ధా సిద్దమయ్యారు. గంటాది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాస్‌ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చని పక్షంలో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.ఒంగోలు ఎంపీగా మంత్రి శిద్దాను పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. ఎంపీగా పోటీకి మంత్రి శిద్దా రాఘవరావు ఆసక్తి చూపలేదు. దర్శి సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని మంత్రి శిద్దా కోరుతున్నారు. ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. మంత్రి కాల్వకు టికెట్‌ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు. కొవ్వూరులో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ కోడెలను కూడా నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలో నిలిపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోడెల భావిస్తున్నట్లు సమాచారం