కష్టాలకు ఎదురీతే.. (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కష్టాలకు ఎదురీతే.. (కృష్ణాజిల్లా)

అవనిగడ్డ, మార్చి 25 (way2newstv.com): 
బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు.గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. 


కష్టాలకు ఎదురీతే.. (కృష్ణాజిల్లా)

ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న  సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్‌ ఉంది.
2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. వైఎస్‌ హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత  మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్‌ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు. 
ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్‌ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్‌ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్‌ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు.   
ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం,  ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది.    
ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే.