విజయవాడ, మార్చి 25(way2newstv.com)
కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాని పదే పదే చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతాన్ని కీర్తించడం ఆయన ప్రసంగాల్లో చూస్తుంటాం. తెలంగాణపై తనకు అభిమానమని అనేకమార్లు చెప్పారు. కొండగట్టు అంజన్న భక్తుడినని అన్నారు. అయితే, ఏమి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారో కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఆయన ఇంతకాలం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉంటున్నాయి. ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడి అనవసర వివాదాలు తలకెత్తుకుంటున్నారు. ఇటీవల పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఒక ఉద్విగ్న వాతావరణంలో ఉంటే పవన్ మాత్రం.. తనకు ఎన్నికల ముందు యుద్ధం వస్తుందనే ఓ కామెంట్ చేసి ఇరుకున పడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉండటంతో పాకిస్తాన్ మీడియా కూడా అక్కడ హైలెట్ చేసుకున్నాయి. అయితే, ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో చేప్పకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయాక తన మాటల అర్థం వేరే అని కవర్ చేసుకున్నారు.ఇక, ఇటీవల తాను పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలోనూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ వ్యాఖ్యానించారు. జగన్ తో తనకు రాజకీయ వైరం ఉంటే ఆయనను విమర్శించాలి.
క్రాస్ రోడ్స్ లో జనసేనాని
లేదా ఆయన అనుచరులనో, ఆయన పార్టీ వారినో విమర్శించాలి. అంతేకానీ రాయలసీమ, పులివెందుల అనే పేర్లు ఉపయోగించడం ఎంతవరకు సబబో పవన్ కే తెలియాలి. ఏ ప్రాంతంలో అయినా, ఏ ఊరిలో అయినా మంచి వారుంటారు. చెడ్డవారుంటారు. అలాగని చెడ్డవారికి ప్రాంతాలను అంటగడితే ఎలా. పీఆర్పీ స్థాపించినప్పుడు పవన్ సోదరుడు చిరంజీవి స్వంత ఊరు పాలకొల్లులో ఓడినా ఇదే రాయలసీమలోని తిరుపతి ప్రజలు గెలిపించిన విషయం పవన్ మరిచిపోయారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రానికి నాయకుడిగా ఉన్న పవన్ రాష్ట్రంలో భాగమైన ప్రాంతాలను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో మరి. ఇక, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చేస్తున్న విమర్శలను పవన్ తన నోటి నుంచి వినిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ ఎలా లబ్ధి పొందారు ఇప్పుడు ఏపీలోనూ కేసీఆర్ ను బూచిగా చూపి, ఆయనతో జగన్ కుమ్మక్కయ్యారని చెప్పి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అది ఆయన రాయకీయ వ్యూహం.చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు పవన్ చేస్తున్నారు. చంద్రబాబు కంటే ఎక్కువే చేస్తున్నారు. తెలంగాణ వాళ్లకు ఆంధ్రా వాళ్లంటే అలుసు అని, ఆంధ్రావాళ్లను కొడుతున్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రాలో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలను టీడీపీ అనుబంధ మీడియా హైలెట్ చేస్తూ ‘‘తెలంగాణనా.. పాకిస్తానా’’ అని భారీగా ప్రచురించాయి. తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చడానికి పవన్ కు నోరెలా వచ్చిందో.. సదరు మీడియా సంస్థలకు రాయడానికి చేతులాలా వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలా పోల్చే అంతటి దుర్మార్గం ఇక్కడ ఏం జరిగిందో పవన్ చెప్పలేదు. ఆంధ్రావాళ్ల భూములు లాక్కుంటున్నారని అని వ్యాఖ్యానించారు. ఎవరి భూములు తీసుకున్నారో అధారాలు మాత్రం చెప్పలేదు. ఆంధ్రావాళ్లను కొట్టారని అన్నారు. ఎక్కడ కొట్టారో ఒక్క సంఘటననైనా ఉదహరించలేదు. తన పార్టీలోకి వచ్చేవాళ్లను అడ్డుకున్నారని ఆరోపించారు. ఎవరిని అడ్డుకున్నారో, ఎవరు అడ్డుకున్నారో పేర్లు కూడా చెప్పలేదు. పైగా పౌరుషం లేదా, ఆంధ్రా పుట్టుక కాదా అని ద్వేషాన్ని తెచ్చే ప్రయత్నం బాగా చేశారు. ఈ వ్యాఖ్యలను అటు ఆంధ్రా ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఏమాత్రం హర్షించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. వారు ఎవరి బిక్షతోనో బతకడం లేదు. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు.ఉద్యమ సమయంలో ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా కేసీఆర్ సహా తెలంగాణ ఉద్యమకారులు విమర్శలు చేశారు. దానికి ఆంధ్రా నాయకులు ప్రతివిమర్శలు చేశారు. అప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన తర్వాత అటువంటి ఉద్రిక్తతలేమీ ఐదేళ్లుగా లేవు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియకపోతే అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందు ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు పొగుడుతారు. ఒకవేళ ఆంధ్రావారిపై దాడులు జరిగి, ఆంధ్రావారి ఆస్తులు లాక్కుంటే కేసీఆర్ ను ఇన్నాళ్లుగా ఎందుకు నిలదీయలేదు. కనీసంగా మీడియా ముందు కూడా ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నట్లుగా ప్రకటించగానే మొట్టమొదట పవన్ ఎందుకు మద్దతు తెలిపారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా సెటిలర్లు ఉన్న ప్రాంతంలో జనసేన టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిందనేది బహిరంగ రహస్యమే. పవన్ సోదరుడు నాగబాబు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ గెలిచినందుకు హర్షం ప్రకటించింది వాస్తవమే కదా. ఐదేళ్ల క్రితమో, పదేళ్ల క్రితమో ఉద్యమ సమయంలో తెలంగాణ నాయకులు చేసిన వ్యాఖ్యలను తన రాజకీయలబ్ధి కోసం ఇప్పుడు రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజనం. ముఖ్యంగా, కొత్త తరహా రాజకీయాలు చేస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ పట్ల కొంతమందైనా ప్రజలు ఆశగా చూస్తున్నారు. అది మరిచిపోయి ఇలా ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి