హైదరాబాద్, మార్చి 29 (way2newstv.com):
తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన “విజన్ డాక్యుమెంట్ ” ప్రాధమిక నివేదిక ను పదహేను రోజులలోగా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ తోర్నంటన్ ఇండియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రీడలు , సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమీషనర్ సునితా యం. భగవత్ , జి.హెచ్.యం.సి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కై విజన్ డాక్యుమెంట్ తో పాటు ప్రస్తుతం వున్న క్రీడా సౌకర్యాలపై విశ్లేషణ, “ఖేలో ఇండియా ” ద్వారా క్రీడల నిర్వహణ తదితర అంశాలపై నివేదికలు , ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులలో ఉన్న ఆసక్తికి , ప్రతిభకు అనుగుణంగా 5,6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
క్రీడల కేంద్రంగా తెలంగాణ
జాతీయ , అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం తో పాటు, హైదరాబాద్ నగర మౌళిక వసతులు మరింత అభివృద్ధి అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా రూపొందించడానికి అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు పూర్తిగా వినియోగించేలా ప్రణాళిక ఉండాలన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన శిక్షణ , యువకులలో వున్న ప్రతిభను వెలికితీయడం లాంటి అంశాలను కూడా దృషిలో ఉంచుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రీడలలో నిర్వహించబోయే ఛాంపియన్ షిప్స్ పై ఈ సమావేశంలో చర్చించారు. 2023 సంవత్సరంలో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యల పై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక పై చర్చించారు.