పల్లెకు దిక్కెవరు..? (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లెకు దిక్కెవరు..? (విజయనగరం)

విజయనగరం, మార్చి 18 (way2newstv.com): 
పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివద్ధిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అత్యంత కీలకం.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండాల్సింది పంచాయతీ కార్యదర్శులే.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కీలకమైన పనులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే ప్రధానపాత్ర. అయితే పంచాయతీల్లో కార్యదర్శల కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల చొప్పున  అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారు.


 పల్లెకు దిక్కెవరు..? (విజయనగరం)

జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలుంటే  502 గ్రామ పంచాయతీలకే గ్రామ కార్యదర్శులు ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించడంతో కార్యదర్శులపై పనిభారం పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రతీ పనినీ ఆన్‌లైన్‌ చేయడం, మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశాలతో వీరిపై మరింత పనిభారం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీఎల్‌ఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండేసి గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఒక్కోసారి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశమే ఉండడం లేదు. పనిభారంతో కనీసం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
ఒకపక్క పనిభారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు  చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువస్తుండడంతో పంచాయతీకార్యదర్శలు  బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారు కావడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.
పంచాయతీల్లో ఈ పాలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా కేటాయించారు. అయితే నెట్‌ సౌకర్యం లేకపోవడంతో కార్యదర్శులు ప్రతి పనికీ మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండకపోవడంతో పారిశుద్ధ్య అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి.