రాజమండ్రి, మార్చి 21, (way2newstv.com)
గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు సాగు ఏటికేడాది తగ్గిపోతోంది. అధిక శాతం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతున్నారు. పొగాకు గిట్టుబాటు కావడం లేదని మొక్కజొన్న, శనగ వంటి పంటల వైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. గోదావరి నదీ ప్రాంతాల్లో వర్జీనియా సాగుచేసే పొలాల్లో అధిక శాతం ఇపుడు తీపి జొన్న, తెల్లజొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో మొక్క జొన్న దాదాపు రెండు లక్షల ఎకరాల్లో, శనగ గత ఏడాది 40 వేల ఎకరాల వరకు సాగు చేస్తే ఈ ఏడాది అంతకు మించి సుమారు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. కేవలం తేమపైనే ఆధారపడి సాగు చేసే అవకాశం వుండటంతో సీతానగరం, కోరుకొండ, గోకవరం, పోలవరం, దేవీపట్నం తదితర మండలాల్లో అత్యధికంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. దీంతో శనగ సాగు గోదావరి నదీ పరీవాహ మండలాల్లో విస్తరిస్తోంది. అదే విధంగా గత ఏడాది పొగాకు పండించే లంక భూముల్లో కూడా మొక్కజొన్న, తీపి జొన్న, తెల్లజొన్న తదితర పంటలను సాగుచేస్తున్నారు.
ఏ ఏటీకాయేటికి తగ్గుతున్న వర్జీనీయా సాగు
తేలికపాటి నల్లరేగడి నేలల్లో సంప్రదాయంగా అనాదిగా వర్జినియా పండించే పొలాల్లో క్రమేణా శనగ, మొక్కజొన్న పండిస్తున్నారు. వర్జీనియా పొగాకు సాగుకు అనుమతి తీసుకుని మరీ ఇతర పంటల వైపు మళ్ళిన పరిస్థితి వుంది. గత ఏడాది కంటే దాదాపు 50 వేల ఎకరాల్లో వర్జీనియా విస్తీర్ణం తగ్గిపోయింది. పొగాకు విస్తీర్ణం క్రమేణా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పొగాకుకు గిట్టుబాటు ధర అంతగా లభించకపోవడంతో పాటు తక్కువ శ్రమ ఎక్కువ లాభం వస్తున్న మొక్కజొన్న, శెనగ రైతులను ఆకర్షిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా వర్జీనియా సాగు నుంచి తప్పుకోవడం కీలక పరిణామంగానే పరిగణించాల్సివుంది. దీనికితోడు జాతీ య మార్కెట్ ఒడిదొడుకులు, జీఎస్టీ కారణంగా కూడా పొగాకు విస్తీర్ణం తగ్గిపోతోందని తెలుస్తోంది. 2017-18 సంవత్సరానికి తూర్పు గోదావరి జిల్లాలోని తొర్రేడు ప్రాంతీయ పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలిస్తే 1754 హెక్టార్లలో పొగాకు సాగుకు అనుమతివ్వగా 1339 హెక్టార్లలో మాత్రమే సాగు చేపట్టారు. దాదాపు నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా సాగు తగ్గిపోయింది. అంటే తొర్రేడు పొగాకు బోర్డు పరిధిలో సుమారు 40 లక్షల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతివ్వగా 26 లక్షల కిలోల ఉత్పత్తివచ్చేలా మాత్రమే రైతులు పండించారు. మొత్తం మీద ఏటికేడాది గోదావరి జిల్లాల్లో వర్జీనియా సాగు తగ్గుముఖం పడుతోంది. పొగాకు స్థానే ఇతర వాణిజ్య పంటలకు రైతులు అనివార్యంగా మొగ్గు చూపుతున్నారు.