కడప, మార్చి 21, (way2newstv.com)
ఎన్నికలను సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఎస్‌పి ఎ.వెంకటరత్నం ఆదేశించారు.ఎటువంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేయాలని ఆదేశించారు. సమిష్టిగా సమన్వయంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలకు తావివ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎక్కడైనా సంఘటన జరిగే ఆస్కారం ఉంటే దాన్ని ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బైండోవర్లు చేయడంలో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలు, రూట్, కేంద్రాలు మధ్య దూరం, స్థితిగతులు పైన ప్రతి అధికారికీ పూర్తి అవగాహన ఉండాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణ కసరత్తు
సమాచార వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం చాలా ముఖ్యమైన అంశమని, దాన్ని అందరూ గుర్తించాలని సూచించారు. ప్రణాళికా బద్ధంగా సమస్యలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలను ఎప్పటికప్పుడు సందర్శించాలన్నారు. అనంతరం సి-విజల్, సువిధ యాప్‌లపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాలు, విధివిధానాలపై అవగాహన కల్పించారు.కేసుల నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీటు దాఖలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుట్కాలు, ఖైనీలు, జూదం, కేసుల సంఖ్యపై ఆరా తీశారు. ఆస్తి నేరాలు, శారీరక నేరాలు, పెండింగ్ కేసులు, పెద్ద తరహా నేరాలను త్వరితగతిన దర్యాప్తు పూర్తీ చేయాలని ఆదేశించారు. దొంగతనాలు జరుగుతున్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బ్లూ కోట్స్, రక్షక వాహనాలు, రాత్రి గస్తీలను విస్తృతంగా తిరగాలని ఆదేశించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచి, అనుమానం ఉన్న కొత్త వ్యక్తుల ఆచూకీ, సమచారం, సేకరించే దిశలో ప్రజా సంబంధాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు