జగన్ ను సీఎం చేస్తా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ ను సీఎం చేస్తా

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.com)
చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపారని మోదుగుల వేణుగోపాలరెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను ఏపీకి దూరం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేత మోదుగుల శనివారం  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా వేసి వైఎస్ జగన్ ఆయణ్ని సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉండలేకే ఆ పార్టీని వదిలి పెట్టినట్టు మోదుగుల వేణుగోపాల రెడ్డి తెలిపారు. గుంటూరుకు గల్లా జయదేవ్‌ అతిథి లాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు. గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని.. బ్యాలెట్‌‌తో గుణపాఠం చెబుతామని తెలిపారు. తన లాంటి నాయకుణ్ని వదులుకోవడం టీడీపీ ఖర్మ అని పేర్కొన్నారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


జగన్ ను సీఎం చేస్తా

గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మోదుగుల అన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేస్తామని వెల్లడించారు. వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.తనలాంటి మచ్చలేని నాయకుడిని, పోరాట యోధుడిని వదులుకోవడం టీడీపీ నేతల ఖర్మని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంటు తలుపులు మూసి తమపై దాడిచేశారని తెలిపారు. తాను పార్లమెంటులోకి కత్తి తెచ్చినట్లు కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాంటి వ్యక్తులతో చంద్రబాబు ఈరోజు జతకట్టారనీ, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణస్వీకారానికి వెళ్లారని మండిపడ్డారు..గుంటూరులో సభల సందర్భంగా ప్లెక్సీలపై ఫొటోలు వేయకపోవడంపై పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయం చూసుకోవాల్సింది జిల్లా అధికారులనీ, దానితో తనకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. జగన్ ఆదేశిస్తే గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గల్లా జయదేవ్ పై పోటీచేస్తానని ప్రకటించారు. గల్లా జయదేవ్ చేసే ఆరోపణలు అన్నింటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు వైసీపీలో చేరిన అనంతరం గుంటూరు జిల్లా పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మోదుగుల మాట్లాడారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.