ఒంగోలు, మార్చి 30 (way2newstv.com)
ప్రకాశం అద్దంకిలో ఆసక్తికరమైన పోరు జరగనుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత టీడీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వైరి వర్గాలుగా ఉంటున్న కరణం కుటుంబం… గొట్టిపాటి కుటుంబం ఒకే పార్టీలోకి వచ్చి చేరాయి. ఒకే పార్టీలో ఉన్న వీరికి చాలారోజులు పడలేదు. ఏదోరకంగా గొడవలు జరుగుతూనే వచ్చాయి. కానీ అధినేత చంద్రబాబు వీరి మధ్య సయోధ్య కుదిర్చి కలిసి పని చేసుకోవాలని చెప్పారు. ఇక ఈ క్రమంలోనే మళ్ళీ అద్దంకి నుంచి పోటీ చేసేందుకు గొట్టిపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కరణం బలరామ కృష్ణమూర్తిని చీరాల బరిలో దించారు.టీడీపీలో విభేధాలు సమసిపోయాయి. ఇక అద్దంకి నుంచి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ తరుపున పోటీ చేస్తుండగా..వైసీపీ తరుపున సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య బరిలో ఉన్నారు. గతంలో అద్దంకిలో నాలుగుసార్లు టీడీపీ నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన ఆయన చివరగా ప్రత్యక్ష ఎన్నికల్లో 2004లో పర్చూరులో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయనకు పోటీ చేసే ఛాన్స్ వచ్చింది.
ప్రకాశంలో కొనసాగుతున్న ఆసక్తికర పోరు
నియోజకవర్గంలో తనకు ఉన్న పాత, కొత్త పరిచయాలను ఉపయోగించుకుని గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. గొట్టిపాటి టీడీపీలో చేరిన దగ్గర నుంచి అద్దంకిని అభివృద్ధి బాట పట్టించారు. ప్రజలకి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అటు ఎమ్మెల్సీగా ఉండి కరణం కూడా నియోజకవర్గంలో పనులు జరిగేలా చూశారు. అటు సొంత గ్రూపు నేతలతో పాటు…ఇటు అసంతృప్తి నేతలనీ కూడా కలుపుకుని గొట్టిపాటి ముందుకు వెళ్లారు. అయితే కరణం చీరాల వెళ్ళినా..ఇక్కడ ఉన్న వారి వర్గం గొట్టిపాటి విజయానికి ఏ మేర సహకరిస్తారో చూడాలి. ఒకవేళ వారు సహకరిస్తే గొట్టిపాటికి ప్లస్ అవుతుంది.వైసీపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బాచిన చెంచు గరటయ్య బరిలో ఉన్నారు. గతంలో గరటయ్య టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్‌గా ఉండటం…నియోజకవర్గంపై పట్టు ఉండటం వైకాపాకి ప్లస్. కానీ ఆర్ధికంగా, వయసు పరంగా బలంగా లేని గరటయ్య గొట్టిపాటిని ఏ మేర ఢీకొనగలరో చూడాలి. ఇక ఇక్కడ జనసేన పోటీ నామమాత్రమే అని చెప్పాలి. ఆ పార్టీ నుంచి కంచర్ల శ్రీకృష్ణ పోటీలో ఉన్నారు. ఇక్కడ వీరి ప్రభావం పెద్దగా ఉండదు. ఇక ఈ నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీ వర్గాలు కీలకం… కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 45 వేలు, ఎస్సీ సామాజిక వర్గంలో మాల ఓటర్లు 26 వేలు, మాదిగ ఓటర్లు 26 వేలు ఉంటారు. ఇక తర్వాత యాదవ, నాయుడు, వడ్డెర, రెడ్డి, వైశ్య, ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు. అయితే గెలుపోటములని మాత్రం కమ్మ, ఎస్సీ ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ గొట్టిపాటికే కొంత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సీనియర్ నేత అయిన గరటయ్యని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరి చూడాలి ఈ సారి అద్దంకిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో.