విశాఖపట్టణం, మార్చి 12, (way2newstv.com)
రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. విశాఖ అర్బన్ జిల్లాలో అదే జరిగేట్టుంది. టీడీపీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీకి పెద్ద దిక్కులా ఉంటూ వచ్చిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మరణించాక ఆయన రాజకీయ వారసత్వం పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్తితులు ఇపుడు కనిపిస్తున్నాయి. మూర్తి సేవలను పూర్తిగా వాడుకున్న టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఆయన మనవడు శ్రీ భరత్ విషయంలో మొండి చేయి చూపించడంతో ఆయన వర్గీయులు సహించలేకపోతున్నారు. దాంతో వారు పార్టీ మారమని మూర్తి మనవడిని వత్తిడి తెస్తున్నారని టాక్. తాజాగా అమరావతిలో జరిగిన పార్టీ సమీక్షలో ఈసారికి టికెట్ ఇవ్వలేమని పక్కా క్లారిటీగా హై కమాండ్ భరత్ కి చెప్పేసింది. దాంతో ఆయన ఆశలు పూర్తిగా అవిరి అయ్యాయి.నిజానికి శ్రీ భరత్ ని ఎంపీ కాకపోతే ఎమ్మెల్యే సీటుకైనా పరిశీలిస్తారని నిన్నటి దాకా వినిపించింది.
వైసీపీ గూటికి శ్రీ భరత్
విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దించుతారని కూడా ఊహాగానాలు చేశారు. అయితే ఇపుడు ఎక్కడా సీటు లేదని తేలిపోయింది. దాంతో శ్రీ భరత్ వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీ భరత్ మరో తాత అయిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైసీపీ వైపుగా చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ తాత సలహాతో శ్రీ భరత్ ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్ కావాలనుకుంటున్నారుట. ఈసారికి విశాఖ ఎంపీగా ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయాలని పట్టుదల మీదున్న శ్రీ భరత్ తన బలాన్ని చూపించుకోవాలన్న కసితో ఉన్నారని సమాచారం.విశాఖలో వైసీపీకి ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు ఎంపీ సీటుకు ఏటూ లేరు. దాంతో రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణనే ఆ పార్టీ నమ్ముకుంది. ఎవరైనా బలమైన నాయకుడు వస్తే సీటు ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉంది. మరి ఇపుడు చూస్తే శ్రీ భరత్ ఫిరాయిస్తారని అంటున్నారు. విశాఖలో ఎంవీవీఎస్ మూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఆయన తన సొంత ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దానికి తోడు గీతం విద్యా సంస్థల తరఫున మూర్తి అంటే తెలియనివారు లేరు. ఆ విధంగా ఆయన పేరుని రాజకీయంగా వాడుకుని యువకుడైన భరత్ ని రంగంలోకి దింపితే మంచి ఫలితాలే వస్తాయని వైసీపీ ఆలోచన చేస్తుందని అంటున్నారు. పైగా టీడీపీ ఓటు బ్యాంక్ ని కూడా చీల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరో వైపు బాలయ్య అల్లుడిగా కూడా భరత్ సినీ గ్లామర్ ని ఉపయోగించుకోవచ్చునని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ తరఫున భరత్ పోటీకి దిగితే మాత్రం విశాఖ ఎంపీ రాజకీయం రంజు మీద ఉంటుందని అంటున్నారు.