కాకినాడ, మార్చి 22 (way2newstv.com):
పంచాయతీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాల్జేసింది. నిధులున్నా తరచూ ట్రెజరీ ఆంక్షలతో వినియోగించుకోలేని దుస్థితిలోకి పంచాయతీలను నెట్టేసింది. అభివృద్ధి పనులు ముందుకు సాగక, ఉద్యోగులకు జీతాలు చెల్లించక గ్రామ పాలన పడకేసింది. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో మొత్తం 779 క్లస్టర పరిధిలో 1,069 పంచాయతీలకు గాను గ్రేడ్ –1 పరిధిలో 300 పంచాయతీలు ఉండగా, గ్రేడ్–2 పంచాయతీలు 231, గ్రేడ్ –3 పంచాయతీలు 308, గ్రేడ్–4 పంచాయతీలు 230 ఉన్నాయి. రిజిస్ట్రార్ విలువ ఆధారంగా పన్నుల భారాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు ఆ స్థాయిలో సదుపాయాల కల్పనను విస్మరించింది.
జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టు ఖాళీ అయ్యి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇన్‌చార్జి పాలనలో ఉండడం గమనార్హం. కాకినాడ డీఎల్‌పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పాలనలో ప్రధాన భూమిక నిర్వర్తించే కార్యదర్శులకు కొరత సమస్య పట్టిపీడిస్తోంది.
పల్లెకు దిక్కెవలు (తూర్పుగోదావరి)
ధృవపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ సేవలు, స్మార్ట్ గ్రామాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, ఇతర పాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు.779 క్లస్టర్లకుగాను 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు ఉండడంతో 230 క్లస్టర్ల పరిధిలోని పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అధికశాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారు. నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాలు నేపథ్యంలో 2013లో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 27 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్‌లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్‌లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు.రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. 2014 ఆగస్టు నాలుగో తేదీతో అనపర్తి పంచాయతీ పదవీకాలం ముగియగా, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక పాలనలో ఉంది. పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 పంచాయతీల్లో సర్పంచ్ పదువులకు ఎన్నికలు జరపాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. సకాలంలో వీటికి ఎన్నికలు జరపకపోవడంతో ప్రత్యేక పాలనలోనే మగ్గాయి.పాలకులు లేకపోవడంతో వెలగని వీధిలైట్లు, డ్రైన్‌లో పారని మురుగునీరు, పనిచేయని కుళాయిలు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారిశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగుపడని అభివృద్ధి, పాలకవర్గాలు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఎనిమిదేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. పట్టించుకునే వారు లేక గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి.