ఏలూరు, మార్చి 22, (way2newstv.com)
‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చి తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుపై ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మిత్రుడని చెబుతూనే.. ఆయన తనకు గిఫ్ట్ ఇచ్చారని, త్వరలోనే ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ప్రకటించి శివాజీరాజా సంచలనం సృష్టించారు. అయితే మెగా బ్రదర్ అయిన నాగబాబును ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని శివాజీరాజా ఏం చేయగలరని చాలామంది లైట్ తీసుకున్నారు. ఓటమి బాధలో శివాజీరాజా అలా మాట్లాడి ఉంటారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం శివాజీరాజా అడుగులు చూస్తుంటే నాగబాబు కోసం నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ పై చర్చొపచర్చలు
‘మా’ ఎన్నికల్లో ఓటమిపాలైన శివాజీరాజా.. రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని సమాచారం. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 24న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ సమయంలో జగన్‌ను శివాజీరాజా కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అంతేకాకుండా నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ తరపున శివాజీరాజా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు రంగంలోకి దిగడం వల్లే శివాజీరాజా వైసీపీలోకి వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడిన నాగబాబును ఓడించి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని శివాజీరాజా భావిస్తున్నారట. నాగబాబు ఇచ్చిన గిఫ్ట్ ఫలించినట్లుగా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.