మొక్కను మింగేస్తున్న మట్టి (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మొక్కను మింగేస్తున్న మట్టి (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 11 (way2newstv.com): 
హరితహారం పథకానికి ‘ఆదిలోనే హంసపాదు’ అనేలా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఉన్నతమైన లక్ష్యంతో ఊరూరా మొక్కల్ని పెంచే ఆశయానికి మట్టి మాయ రూపంలో గండి పడుతోంది. మొక్కను పెంచే బాధ్యత మొక్కుబడిగా సాగుతుండటం..పర్యవేక్షణలు నామమాత్రమవుతుండటంతో కీలకమైన మొక్కల ఎదుగుదల ప్రక్రియకు శాపంగా మారుతోంది. ఫలితంగా 2019-20 సంవత్సరానికి అవసరమైన మొక్కలకు అప్పుడే విఘాతం వాటిల్లే చర్యలు కరీంనగర్‌ జిల్లాలోని పలు నర్సరీల్లో కనిపిస్తున్నాయి. రూ.21.91కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న వననర్సరీల నిర్వహణ తీరులో లోపభూయిష్టంగా మారింది.
కరీంనగర్‌ జిల్లాలోని 313 గ్రామాల్లో 2.30కోట్ల మొక్కల్ని పెంచాలని డీఆర్డీఏ, ఆటవీశాఖ అధికారులు నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా వీటిని నాటేందుకు అందించాలనే ఉద్దేశంతో ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా డీఆర్డీఏ పర్యవేక్షణలో 244 గ్రామపంచాయతీల్లో 1.65కోట్లు, ఆటవీశాఖ ఆధ్వర్యంలో 69 గ్రామాల్లో 69లక్షల మొక్కలను పెంచాలని భావించారు. ఇందుకోసం ఒక్కో నర్సరీలో కనీసం లక్ష మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు సుమారు 90 రోజులు పనికల్పించడంతోపాటు ఒక్కో నర్సరీలో ఒక్కో మొక్కను పెంచేందుకు రూ.7 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా 313 నర్సరీలకుగానూ రూ.21.91 కోట్లను ఖర్చు చేయనున్నారు.



మొక్కను మింగేస్తున్న మట్టి (కరీంనగర్)

ఉపాధిహామీ క్షేత్రసహాయకుడి పర్యవేక్షణలో కొనసాగే ఈ ప్రక్రియను మండలాభివృద్ధి అధికారితోపాటు ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఎక్కువ శాతం నర్సరీల్లో నిబంధనల ప్రకారం మొక్కలు పెంచే ప్లాస్టిక్‌ సంచుల్లో సరైన మట్టిని నింపడం లేదు. అందుబాటులో ఉన్న మట్టిని తీసుకొచ్చి కీలకమైన ప్రక్రియను.. మొక్కుబడిగా కొనసాగిస్తున్నారు. అధికారులు చెబుతున్న సూచనల ప్రకారం రెండు పరిమాణాల్లో ఉండే నల్లని ప్లాస్టిక్‌ సంచుల్లో 50 శాతం ఎర్రమట్టి, 25 శాతం పశువుల ఎరువు, 25 శాతం నల్లని మట్టిని నింపాలి. ఈ మట్టిని కూడా వడకట్టి సమపాళ్లల్లో ఉండేలా చూడటంతోపాటు సన్నగా మార్చేందుకు వడపోత ప్రక్రియను నిర్వహించాలి. కాగా చాలా చోట్ల ఈ విధానం అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మట్టిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం ఖర్చుతో కూడిన వ్యవహారమనే సాకుతో నర్సరీకి సమీపంలో ఉన్న మట్టినే వినియోగిస్తున్నారు. మట్టిపెళ్లలతో అలాగే సంచుల్లో నింపుతున్నారు. వాటిలో మొలకెత్తిన చిన్న మొక్కల్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల అనుకున్న విధంగా మొక్కల్లో ఎదుగుదల కనిపించడం లేదు.
గతేడాదిలో చాలాచోట్ల ప్రజాధనం వృథా అవడంతో ఈ సారి నిర్వహణ బాధ్యతల్లో మార్పులు చేర్పులకు అధికారులకు శ్రీకారం చుట్టారు. అయినా మొదటి అంకంలోనే నిర్లక్ష్యం తొంగి చూస్తుండటం ఇబ్బందిని కలిగిస్తోంది. సుమారు 20కిపైగా రకాల మొక్కల్ని పెంచేందుకు ప్రయత్నించడం. లక్ష్యాలను చేరుకునే ధ్యాసపై అధికారులు దృష్టి పెడుతున్నారు. వచ్చే జూన్‌ లేదా జులై నెలాఖరులోగా మొక్కలు సిద్ధమవ్వాలంటే నర్సరీల్లో పనులు వేగంగా సాగాలనే ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. కొన్నిచోట్ల అనుకున్నట్లుగా స్థలాల ఎంపిక ప్రభావం, ప్రభుత్వ భూమి దొరక్కపోవడంలాంటి ఇతరత్రా సమస్యల వల్ల ఇప్పటికే జాప్యం జరిగింది. ఈ సమయంలో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నర్సరీలపై అధికారుల పర్యవేక్షణ పెరగాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో కీలకమైన మట్టిని నింపిన సంచులను పరిశీలిస్తే లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్వహణ తీరు ముందుకు సాగే వీలుంది. ఈ దిశగా అధికారులు దృష్టిసారిస్తే హరితహారం ఆశయానికి మేలు జరుగనుంది.