నిజామాబాద్, మార్చి 11 (way2newstv.com):
నిరుద్యోగుల విషయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి విద్యుత్తు శాఖలో జేఎల్‌ఎంల పోస్టుల భర్తీ ఒక నిదర్శనం. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అందరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు మాత్రం తప్పుడు నిర్ణయాలతో కడుపులో సల్ల కదలకుండా పనిచేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. జేఎల్‌ఎంల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాల్సిన అధికారులు ఏడాదిగా తాత్సారం చేస్తున్నారు.
2018 ఫిబ్రవరి 2న 497 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం విద్యుత్తు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 8న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. మే 25న రాతపరీక్ష ఫలితాలు వెల్లడించారు. ఇందులో అర్హత సాధించిన 497 మంది అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 18న స్తంభం ఎక్కే పరీక్షలు చేపట్టారు. ఫిబ్రవరి 1 వరకు కొనసాగాయి. ఇలా ఏడాది కాలం నుంచి జేఎల్‌ఎం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇలా అయితే ఎలా..? (నిజామాబాద్)
497 జేఎల్‌ఎంల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్షలో అర్హులైన వారిని ఎంపిక చేశారు. అయితే స్తంభం ఎక్కే పరీక్షలకు కేవలం ఒక్క పోస్టుకు ఒక్కరి చొప్పునే పిలిచారు. కానీ, పిలిచిన ప్రతి ఒక్కరు స్తంభం ఎక్కలేరు కాబట్టి.. వీరిలో సుమారు 50 శాతం మందే అర్హత సాధించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయాలంటే మళ్లీ స్తంభం ఎక్కే పరీక్షలకు అర్హులైన అభ్యర్థులను పిలవాల్సి ఉంటుంది. ఇలా ఒక పోస్టుకు ఒక్కరిని పిలవడం, అర్హత సాధించకుంటే మళ్లీ పరీక్షలు నిర్వహించడం.. ఇలా చేస్తూ వెళితే రెండేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ ఉండదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఉద్యోగాల భర్తీ విషయంలో విద్యుత్తు శాఖ అధికారులు నత్తతో పోటీ పడుతున్నారు. మూడు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల కోడ్ అడ్డు తగిలింది. ప్రస్తుతం 50 శాతం మందే స్తంభం ఎక్కే పరీక్షల్లో అర్హత సాధిస్తే.. మరోసారి ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాలుగు రోజులు గడిస్తే లోక్‌సభ ఎన్నిల కోడ్ సైతం అమల్లోకి అచ్చే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పోస్టుల భర్తీకి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.
ఇటీవల అన్ని జిల్లాల్లో స్తంభం ఎక్కే పరీక్షలు చేపట్టారు. ఆయా జిల్లాల్లో స్తభం ఎక్కినవారి ధ్రువపత్రాలు తీసుకొని, ఎక్కని వారి ధ్రువపత్రాలు తిరిగి ఇచ్చేశారు. మన జిల్లాలో మాత్రం స్తంభం ఎక్కని వారివి, ఎక్కినవారివి అందరివి తీసుకున్నారు. ఎవరికీ తిరిగి ఇవ్వలేదు.దీంతో ఎంత మంది అర్హత సాధించారో తెలియడం లేదు. మళ్లీ మిగిలినవారికి ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పడం లేదు. జిల్లా అధికారుల వద్దకు వెళితే తమకు ఎలాంటి సంబంధం లేదని, వరంగల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అడగాలని సమాధానం ఇస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని, ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.