అన్నీ అష్టకష్టాలే (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నీ అష్టకష్టాలే (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 8  (way2newstv.com):
 మిర్చి రైతులకు ఈ ఏడాది విత్తనం దశ నుంచి విపణిలో పంటను అమ్మేంత వరకు అడుగడుగునా నష్టాలు తప్పడం లేదు.. పండిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌకర్యం అందుబాటులో లేకవడం.. రోజురోజుకు ధరలు పడిపోతూ గిట్టుబాటు ధర లభించకపోవడం.. మార్కెట్‌లో దళారుల మోసంతో లాభాల కంటే నష్టమే మిగులుతోంది.
ఉద్యానవన శాఖ అధికారుల సర్వే ప్రకారం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 520 ఎకరాల్లో రైతులు మిరప పంటను సాగు చేశారు. ఆదిలాబాద్‌ మండలంతో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, బేల మండలాల్లో అత్యధికంగా రైతులు మిర్చి సాగు చేశారు. తాంసి, తలమడుగు, భీంపూర్‌, జైనథ్‌, బోథ్‌ ఇతర మండలాల్లో తక్కువ మొత్తంలో వేశారు. గత ఏడాది 725 ఎకరాల్లో మిరప పంటకు సాగు చేయగా, ఈ ఏడాది 520 ఎకరాల్లోనే సాగు చేశారు. గతేడాది ధర రూ. 8 వేల లోపే ఉండడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులే మిగిలాయి. దీంతో ఈ ఏడాది మిర్చి పంట వైపు రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. కొంతమంది రైతులు ఉద్యానవన శాఖ అధికారుల సూచన మేరకు ఈ ఏడాది వరంగల్‌, మహారాష్ట్ర నుంచి అధిక దిగుబడులు అందించే విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి రూ. 20 వేల నుంచి 25 వేల వరకు చెల్లించారు. విత్తనం నాటిన నుంచి పూత, కాత దశ వరకు వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించలేదు.


అన్నీ అష్టకష్టాలే (ఆదిలాబాద్)
 
మొదటి నుంచి ముడత, వైరస్‌ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రిమిసంహరక మందులను వారం వ్యవధిలోనే పలుమార్లు  పిచికారీ చేశారు. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. దీంతో పూత, కాత సరిగా రాక దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కొంతమంది రైతులు మహారాష్ట్ర నాగ్‌పూర్‌ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతుంటే, మరికొందరు రైతులు స్థానికంగా కిలోల చొప్పున అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది.
గతేడాది క్వింటాలు మిర్చికి విపణిలో రూ. 8 వేల వరకు ఉంటే  ఈ ఏడాది కూడా రూ. 7 వేల నుంచి 8 వేల లోపే ధర పలుకుతోంది. పెట్టుబడి  ఎకరానికి రూ.70 నుంచి 80 వేల వరకు ఖర్చు చేయగా దిగుబడులు, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఒక్కో రైతు ఎకరానికి రూ. 10వేల వరకు తిరిగి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తక్కువ ధరకు పంటను అమ్ముకోలేక కొందరు రైతులు పంట పొలాల్లోనే మిర్చి పంటను నిల్వ పెట్టుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం చలి తీవ్రత, మిగతా సమయంలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో  మిర్చి కాయల నాణ్యతపై ప్రభావం చూపుతోంది.
ఆదిలాబాద్‌ జిల్లాలో మిర్చి మార్కెట్‌ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి.. రవాణా ఛార్జీలు ఎక్కువ మొత్తంలో చెల్లించి మహారాష్ట్ర నాగపూర్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు కూటమికట్టి  రోజురోజుకు ధరలను తగ్గిస్తున్నారు. ఇదిలా ఉంటే తరుగు కింద ఒక క్వింటాలు మిర్చికి 4 కిలోల చొప్పున తీసివేయడం, వందకు కమిషన్‌ కింద రూ. 5 చొప్పున దళారులు వసూలు చేస్తున్నారు. మార్కెట్‌లోని కూలీలు సైతం కిలోల చొప్పున మిరప కాయలను తీసి పక్కనెట్టుకుంటున్నారు. ఇలా రైతులు అడుగడుగునా చేసిన కష్టాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర మార్కెట్‌కు తీసుకెళ్తే వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ సౌకర్యం లేక రవాణా, కమిషన్‌, ఇతర ఖర్చులతో కలిపి క్వింటాలుకు రూ. 400ల నుంచి 500ల వరకు రైతులు నష్టపోతున్నారు.
పండించిన పంటకు సరైన ధర లేకుంటే దాచుకోవడానికి జిల్లాలో ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు. దీంతో ఎక్కువ రోజులు పంటను ఇల్లు, పొలాల్లో నిల్వ ఉంచుకునే మార్గం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి జిల్లాలో మిర్చి మార్కెట్‌ ఏర్పాటుతో పాటు కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.