ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక సేవ తొలిశిక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక సేవ తొలిశిక్ష

సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టిన గుంటూరు జెసి హిమాన్షు శుక్లా
విజయవాడ మార్చ్ 5 (way2newstv.com
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏమోతుంది, మహా అయితే వెయ్యి రూపాయల జరిమానా, కట్టేస్తే తదుపరి షరా మాములే. ఇక ఇప్పుడలా కుదరదు. జరిమాన కట్టి జారుకుందామంటే కుదరదు. మరో మూడు రోజుల సామాజిక సేవ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రహదారి భద్రతకు పెద్దపీట వేస్తున్న గుంటూరు జిల్లా సంయిక్త కలెక్టర్, అదనపు జిల్లా న్యాయాధికారి  హిమాన్షు శుక్లా ఉల్లంఘనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారిలో మార్పును ఆకాంక్షిస్తూ సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా బహుశా రాష్ట్రంలోనే తొలిసారిగా సామాజిక సేవను దండన రూపంలో విధిస్తున్నారు. ఫలితంగా రహదారి నియమాలను తప్పితే నిందితులు విభిన్న రూపాలలో నిర్భంధంగా సామాజిక  సేవ చేయవలసి ఉంటుంది. అది ఏరూపంలోనైనా ఉండవచ్చు.  


 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక సేవ తొలిశిక్ష

మధ్యాహ్న భోజన పధకంలో వడ్డన, ఆసుపత్రులలో సేవకుడు,  ట్రాఫిక్ పోలీస్కు సహాయకారి, ప్రార్ధనా మందిరాలను పరిశుభ్రం చేయటం, రహదారులను పరిశుభ్రం చేయటం, వయోవృద్ధులకు సహాయకులుగా ఉండటం, స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ లక్ష సాధనకు సహకరించటం... ఇలా పలు విధాలుగా శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది.రోడ్డు ప్రమాదాలలో నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇందుకు కొన్ని సందర్భాలలో ఎవరికి వారే కారణం కావచ్చు. మరి కొన్ని సందర్భాలలో ఎవరో చేసిన తప్పులకు ఇంకెవ్వరో నష్టపోతున్నారు. అది ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణనష్టం కావచ్చు. కేవలం అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించటం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్నదే కదా అని వదిలేసినా, స్వల్ప జరిమానాతో సరిపుచ్చినా వారిలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు. డ్రైవింగ్ లైసెన్సు రద్దు వంటి కఠిన  నిర్ణయాలు సైతం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇటీవల జిల్లా సంయిక్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శుక్లా అదనపు జిల్లా న్యాయమూర్తిగా తన న్యాయాధికారాలకు పదును పెట్టారు. రహదారి భధ్రత నియమాలను పక్కన పెట్టి ద్విచక్రవాహనం నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడుతున్న మంగళగిరివాసి నాగసతీష్కు సామాజిక సేవను దండనగా విధిస్తూ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శుక్లా ఉత్తర్వులు జారీ చేసారు. మంగళవారం నుండే ఈ ఉత్తుర్వులు అమలులోకి రాగా మూడురోజుల పాటు మధ్యాహ్న భోజన పధకం అమలులో సహాయకారిగా ఉండాలని, విద్యార్ధులకు భోజనాన్ని అందించాలని నిర్ధేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు జిల్లా రవాణా అధికారి తదనుగుణ చర్యలు తీసుకోవాలని తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపటం గణనీయంగా పెరిగిందని, అది వారితో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర చోదకులకు కూడా నష్టం తెస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. గతనెల 28వ తేదీన జరిగిన రహదారి భద్రత సమావేశాలలో కూడా ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశం కాగా, దీనికి అడ్డుకట్ట వేసే క్రమంలో నూతన దండన విధానాలను అమలు చేయాలని సంకల్పించామన్నారు. వారు చిన్న తప్పుగా భావించే మెబైల్ డ్రైవింగ్ వల్ల మూడు, నాలుగు రోజులు సామాజిక సేవ చేస్తే అది వారికి జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు. కేవలం నేటి యువతలో మార్పు కోసమే ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నామని, సామాజిక సమస్యగా పరిణమిస్తున్న రహదారి నియమాల ఉల్లంఘనకు సామాజిక సేవే సరైన సమాధానం చెబుతుందని భావిస్తున్నామన్నారు. సామాజిక వేత్తలు, ప్రజాప్రతినిధులు దీనికి తమవంతు సహకారం అందించాలని విన్నవించారు.