కర్నూలు, మార్చి 20, (way2newstv.com)
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విపత్కర పరిస్థితుల్లో విలవిలల్లాడుతోంది. 2014 ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆశలకు గండికొట్టే విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. శ్రీశైలం అభ్యర్థిగా తాజా, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించిన అనంతరం చివరి క్షణంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకు, కుటుంబానికి, కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని, అందుకే రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారునంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్సీవై రెడ్డి ఫ్యామిలీని చంద్రబాబునాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. నంద్యాల ఎంపీ టిక్కెట్ తో పాటు శాసనసభ నియోజకవర్గం టిక్కెట్ ను కూడా కేటాయించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి కోసమంటూ అందరికంటే ముందే జంప్ చేసిన ఎస్పీవై రెడ్డికి తీవ్ర అవమానమే ఎదురయింది.
నిరాశలో కర్నూలు తమ్ముళ్లు
నంద్యాల ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు శివానందరెడ్డి పేరును ఖరారు చేశారు. తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి ప్రయత్నించారు. చివరకు నంద్యాల అసెంబ్లీ సీటు తిరిగి భూమా బ్రహ్మానందరెడ్డికే దక్కింది. దీంతో నంద్యాల ప్రాంతంలో పేరున్న ఎస్పీవై రెడ్డికి ఏ సీటూ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగానైనా పోటీ చేయాలని వత్తిడి తెస్తున్నారు.టీజీ వెంకటేశ్ అనుకున్నది సాధించారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ తన కుమారుడు టీజీ భరత్ సీటు కోసం టీజీ విశ్వప్రయత్నాలు చేశారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి మారిన ఎస్వీ మోహన్ రెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో టీజీ భరత్ కు టిక్కెట్ ఇవ్వడానికే బాబు మొగ్గు చూపారు. కర్నూలు పట్టణంలో పట్టున్న టీజీ కుటుంబానికే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. నంద్యాల టిక్కెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడంతో ఎస్వీ మోహన్ రెడ్డికి కర్నూలు టిక్కెట్ దక్కలేదని తెలుస్తోంది. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్ గతంలో ఎస్వీ మోహన్ రెడ్డి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎస్వీకి కాకుండా టీజీవైపే బాబు మొగ్గు చూపారు. మరి ఎస్వీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.