ఎమ్మిగనూరు, మార్చి 11 (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. కేవలం నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో చేనేత పురిని ఏ లేది ఎవరని ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా పలు పార్టీల అభ్యర్థులు అనధికారిక ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలోనే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కు కేవలం 30 రోజులే ఉండడంతో నాయకులు బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఓట్ల కోసం హామీలు ఇచ్చుకుంటూ నియోజకవర్గాలలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన డా.బి.వి జయ నాగేశ్వరరెడ్డికి అదిష్టానం టికెట్టు కేటాయించడంతో ఆయన గత కొద్ది రోజుల నుండి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తు పట్టణములో మరియు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెదేపా హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయని, పింఛన్లు,రుణమాఫీ, నిరుద్యోగ భృతి తదితర పథకాలతో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన వైకాపా ఈసారి ఎన్నికల్లో చావో రేవో అన్న స్థాయిలో సర్వ శక్తులు ఒడ్డుతోంది.
ఎమ్మిగనూరులో వేడెక్కనున్న ప్రచార పర్వం
నియోజకవర్గ పరిధిలో వైకాపా తరపున మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు పార్టీల వారిని వైసీపీలోకి చేర్చుకొనే కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంటింటా ప్రచారం కూడా నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాలు అమలు వంటివి చేపడుతూ వచ్చింది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ కొత్త ప్రచార కార్యక్రమానికి వైకాపా శ్రీకారం చుట్టింది.గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ లో ప్రవేశపెట్టిన ప్రధాన హామీ లైన నవరత్నాలు అనే పథకాలను ప్రజలలోకి తీసుకెళుతున్నారు. గడచిన 14 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించారని, జగన్ ప్రభావం, ప్రభుత్వం పై వ్యతిరేకత తన విజయానికి సహకరిస్తాయని వారు భావిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. భాజపా అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కె.ఆర్ మురహరి రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలను అందజేస్తూ ప్రజలలోకి వెళుతున్నారు. మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఆయనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ జర్నలిస్టు మద్దిలేటి ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో తేదేపాకు మద్దతిచ్చిన జనసేన పార్టీ ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. పార్టీ ఆవిర్భావం రోజైనా ఈనెల 14న ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఎక్కువ మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వనుంది. అందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎవరు నిలబడతార లేక నిలబడక పోవచ్చా అనే విషయం తెలియాల్సి ఉంది.