అనంతపురం, మార్చి 22, (way2newstv.com)
కంచుకోటగా ఉన్న జిల్లాలో పార్టీ బీటలు వారుతోంది. టిక్కెట్ ఖరారుతో తకరారు మొదలయింది. రాయలసీమ జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లా అనంతపురం అని చెప్పకతప్పదు. గత ఎన్నికల్లోనూ 14 నియోజకవర్గాలకు గాను పన్నెండు స్థానాలను గెలుచుకుని అనంత ప్రజలు సైకిల్ పార్టీకి అండగా నిలిచారు. ఉద్దండులైన నేతలు ఉండటం కూడా ఆ పార్టీకి ప్లస్. ఇప్పుడు అదే మైనస్ అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. టిక్కెట్ల కేటాయింపు పూర్తి కావడంతో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఎక్కువ మంది నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు పరోక్షంగా, మరికొందరు ప్రత్యక్షంగా అభ్యర్థుల ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారు.కల్యాణదుర్గం నియోజకవర్గంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఉమామహేశ్వరనాయుడికి టిక్కెట్ దక్కింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఉమామహేశ్వరనాయుడి కంటే ముందుగా ఎస్ఆర్ఎస్ కన్ స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబునాయుడికి టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సురేంద్ర బాబు నాయుడును ప్రచారం కూడా చేసుకోవచ్చని పార్టీ కార్యాలయం తెలపడంతో ఆయన కల్యాణదుర్గంలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
అనంతపురం టీడీపీకి బీటలు
ఇంతలోనే ఉమామహేశ్వరనాయుడి పేరును అధిష్టానం ఖరారు చేసింది.దీంతో టిక్కెట్ వచ్చిందని చెప్పి తిరస్కరించడంతో సురేంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్ దక్కకపోవడానికి, ఉమామహేశ్వరనాయుడికి రావడానికి కారణం పయ్యావుల కేశవ్ అని ఆయన బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తనకు అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, దీంతో తాను ఉరవకొండలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పయ్యావులను ఓడిస్తానని సురేంద్ర బాబునాయుడు చెబుతున్నారు. పయ్యావులను ఓడించడమే తన లక్ష్యమని ఆయన చెబుతుండటం విశేషం.ఇక తనకు టిక్కెట్ దక్కకపోవడానికి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కారణమని ఉన్నం హనుమంతరాయచౌదరి చెబుతున్నారు. జేసీకి తన సత్తా ఏందో చూపుతానని హెచ్చరిస్తున్నారు. ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ఓడించడంతో పాటు ఎంపీ అభ్యర్థి జేసీ వపన్ కుమార్ రెడ్డి టార్గెట్ గా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాధరెడ్డికి వ్యతిరేకంగా ముగ్గురు రెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు.అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇచ్చినందుకు నిరసనగా టీడీపీ నేత జయరాంనాయుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. గుంతకల్లు, శింగనమల, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లో సయితం సైకిల్ పార్టీపై తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈసారి అనంతపురం తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ నేతలే దెబ్బకొట్టేలా ఉన్నారని పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. పోలింగ్ నాటికి అసమ్మతినేతలను బుజ్జగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.