న్యూఢిల్లీ, ఏప్రిల్ 27, (way2newstv.com)
ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 ఉత్పత్తులకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యున్నత నాణ్యత, వైశిష్ట్యం కలిగిన ఉత్పత్తులకు అందజేసే ఈ జీఐ ట్యాగ్‌ను అందుకున్న ఉత్పత్తుల్లో హిమాచల్‌కు చెందన కాలాజీరా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జీరాపూల్, ఒడిశాకు చెందిన కందమాల్ హల్దీ తదితర ఉత్పత్తులున్నాయి. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ అందించిన వివరాల మేరకు ఈ ట్యాగ్‌ను అందుకున్న ఇతర ఉత్పత్తుల్లో కర్నాటకకు చెందిన కూర్గ్ అరబికా కాఫీ, కేరళ వైనాడ్‌కు చెందిన రోబస్టా కాఫీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు వ్యాలీ అరబికా కాఫీ, కర్నాటకకు చెందిన సిరిసి సుపారీ, హిమాచలీ చులీ ఆయిల్ వంటివి ఉన్నాయి.
14 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్
ఈ జిఐ ట్యాగ్ వల్ల సంబంధిత ఉత్పత్తిదారులకు మంచి ధరలు సమకూరడమేకాక, మరే ఇతర ఉత్పత్తిదారులూ దీని డూప్లికేట్‌ను తయారుచేసి పేరును దుర్వినియోగం చేసేందుకు వీలుండదు. ప్రధానంగా ప్రాంతీయ వ్యవసాయోత్పత్తులు, ప్రకృతిసిద్ధమైన లేదా తయారుచేసిన (చేతివృత్తులు, లేదా పారిశ్రామిక) ఉత్పత్తులకు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను వినియోగిస్తారు. ఉత్పత్తి నాణ్యతతోబాటు ఆ ప్రాంత విశిష్టతను ఈ ట్యాగ్ తెలియేజేస్తుంది. డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డూ, కాంగ్రా పెయింటింగ్స్, నాగ్‌పూర్ కమలాలు, కాశ్మీర్ పాస్మినా వంటి మనదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఉత్పత్తులు ఇలా జిఐ ట్యాగ్‌ను పొందినవే. దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ట్యాగ్ వల్ల సంబంధిత ఉత్పత్తి వైశిష్ట్యం మరింతగా పెరుగుతుందని, వినియోగదారులకు సైతం ఉత్పత్తిపై పూర్తి విశ్వాసం కలుగుతుందని ‘నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (నిపో) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు. మొత్తం పదేళ్ల కాలానికి ఈ ట్యాగ్ అమలులో ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకు ఏర్పాటైన ఈ ట్యాగ్ ఇప్పటి వరకు మనదేశానికి చెందిన 344 ఉత్పత్తులకు మంజూరైంది. 2004లో తొలిసారి ఈ ఘనతను డార్జిలింగ్ టీ అందుకుంది