తాగునీటికి కట కట
ఖమ్మం ఏప్రిల్ 22, (way2newstv.com)
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చేతి పంపులు ద్వారా అర్థగంటకో బిందెడు నీరు రెక్కలు పడిపోయేవరకు కొట్టినా రంగుమారిన నీరు వస్తోంది. రక్షిత మంచినీటి సరఫరా పథకాలు తరచూ మరమ్మతులకు గురవడం, ముందు జాగ్రత్తలు చేపట్టకపోవడంతో గ్రామాలలో వాటర్ ట్యాంక్‌లు అలంకారప్రాయంగా మారాయి.గిరిజన గ్రామాలలో త్రాగునీటి సమస్య జటిలం కావడంతో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం వాగుల, వంకలను ఆశ్రయించి చెలిమ నీటిని వినియోగిస్తున్నారు. అనేక గ్రామాలలో మంచినీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. విద్యుత్ సమస్య కూడా దీనికి తోడైంది.
పడిపోతున్న భూగర్భజలాలు..
వాజేడు మండలాలలో గోదావరి ఒడ్డు మీద ఉన్న పూసూరు గ్రామంలో సుమారు 300కుటుంబాలకు పైగా ఉండగా గోదావరి ఒడ్డు దిగి కిలోమీటరుపైగా కాలి నడకన వెళ్లి ఇసుకలో చెలిమలు తీసుకుని మంచినీటిని తెచ్చుకుంటున్నారు. కడేకల్ గ్రామంలో ఒకే బావిలో నీరు ఉండడంతో గ్రామస్థులందరూ ఈ బావి నండే నీరు తెచ్చుకుంటున్నారు. దీంతో బావిలో నీరు అడుగంటి రంగు మారిన నీటిని వినియోగించుకుంటు అస్వస్థతకు గురవుతున్నారు. మొలకనపల్లి, కొండాపురం, సూరవీడు, ఎదిర, కర్రవోలు గుంపు, నూగరు ఇంకా అనేక గ్రామాలలో బోరు బావులు పనిచేయకపోవడంతో ఆయ గ్రామాల ప్రజలు వాగులు, వంకలు, చెరువులకు పరుగులు తీస్తున్నారు. సూరవీడు పంచాయతీలోని స్వయంగుంపు, కొండాపురం కాలనీవాసులు మాత్రం వాగులో చెలమలు తీసుకుని నీటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. గిరిజన గ్రామాలలో నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు సరైన ప్రణాళికతో అధికార యంత్రాంగం ముందుచూపు లేకపోవడంతో నీటిసమస్యతో గిరిజనులు సతమతమవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే మంచినీరు పూర్తి స్థాయిలో లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నీటి సమస్యలు ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసి ఆదుకోవాలని గిరిజనలు పత్రిక ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు