టీ కాంగ్రెస్ కు మంచి రోజులేనా.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీ కాంగ్రెస్ కు మంచి రోజులేనా..

హైద్రాబాద్, ఏప్రిల్ 15, (way2newstv.com)
నాలుగు నెలల క్రితం తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో తలపండిన మేథావుల అంచనాలు సైతం తలకిందులయ్యాయి. మహాకూటమి ప్రచారంలో ఒక్క సారిగా హైప్‌ తీసుకురావడం, మీడియాలో మహాకూటమికి అనుకూలంగా అంచనాలకు మించి ప్రచారం జరగడంతో కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చాలా మంది లెక్కలు వేశారు. అయితే వీరి అంచనాలన్నీ ఎన్నికల ఫలితాల్లో తేడా కొట్టేశాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ చివరి మూడు రోజులు తెలంగాణ ఎన్నికలను కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు అన్నట్టుగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు వర్సెస్‌ చంద్రబాబు అన్న టాక్‌ తీసుకువచ్చి మహాకూటమిని ఆ ఒక్క డైలాగ్‌తో దెబ్బ కొట్టేసారు. ఫలితంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వార్‌ వస్‌ సైడ్‌ అయిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్‌ 88 స్థానాలు గెలుచుకుని మరో సారి అధికారం దక్కించుకుంది.ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ ఉంచి గెలిచిన మరో పది మంది శాసనసభ్యులు కూడా టీఆర్‌ఎస్‌ గూటికి జంప్‌ చేసేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కోల్పోయినట్లే అని అక్కడ తెలుగుదేశం పార్టీ ఎలాగైతే భూస్థాపితం అయ్యిందో కాంగ్రెస్‌కు సైతం అదే పరిస్థితి వస్తుందని చాలా మంది భావించారు. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో తెలంగానలో కాంగ్రెస్‌ కనీసం ఉనికిని అయినా చాటుకుంటుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. 


టీ కాంగ్రెస్ కు మంచి రోజులేనా..

తాజాగా తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అంచనాలకు మించి పుంజుకున్నట్లు పోలింగ్‌ సరళి చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఎప్పుడూ ఓ ప్రహసనంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో పార్టీలో గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు బయటపడ్డాయి. దీంతో ఎన్నికలు జరగకుండానే ఈ సారి కూడా కాంగ్రెస్‌ చేతులు ఎత్తేస్తుందని అందరూ భావించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరును బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కొత్త ఊపిరి ఊదినట్టే స్పష్టం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఐదు నుంచి ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగా… మూడు నుంచి నాలుగు సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంగా చూస్తే శాసనసభ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేయడంతో లోక్‌సభ ఎన్నికలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పూర్తి వన్‌ సైడ్‌గా ఉంటాయని అందరూ అంచనా వేశారు. అయితే ఎన్నికల రోజున మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్‌, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని చెబుతున్నారు. ఈ స్థానాలతో పాటు భువనగిరి లాంటి చోట్ల కాంగ్రెస్‌ మంచి ఫైట్‌ ఇవ్వొచ్చని అంచనా. తెలంగాణలో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మెజారిటీ ప్రజలు టీఆర్‌ఎస్‌ నియంతృత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలను ఇష్టపడడం లేదని ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభం అయ్యిందనడానికి ఈ లోక్‌సభ ఎన్నికలే నిదర్శనం కానున్నాయని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.